YS Jagan: సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్..! డెడ్ లైన్ దగ్గరపడుతున్న వేళ..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన్ను ఈనెల 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు గతంలో ఆదేశించింది. దీంతో జగన్ సీబీఐ కోర్టులో హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
దశాబ్దానికి పైగా సుదీర్ఘంగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై సుప్రీంకోర్టు గతంలోనే కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణలు త్వరగా పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలని ట్రయల్ కోర్టుల్ని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీబీఐ కోర్టు అక్రమాస్తుల కేసులో విచారణను వేగవంతం చేసింది. అయితే ఈ మధ్యే జగన్ యూరప్ టూర్ కు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. ఈ సమయంలో యూరప్ టూర్ నుంచి రాగానే ఈ నెల 14న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సీబీఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ ఈ నెల 14న స్వయంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ లోపే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టుకు తాను హాజరు కావాలంటే అధికార యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి భారమని తెలిపారు. కాబట్టి తప్పనిసరిగా విచారణకు హాజరుకోవాలని కోర్టు భావిస్తే మాత్రం హాజరయ్యేందుకు ఇబ్బంది లేదని జగన్ తెలిపారు. మరోవైపు కోర్టు వీడియో కాన్ఫరెన్స్ కు అనుమతి ఇచ్చినా హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అంతకంతకూ ఆలస్యమవుతోంది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకూ తమ దర్యాప్తును పూర్తి చేయలేదు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు దాఖలు చేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లు ఇందుకు ఆటంకంగా మారాయని గతంలో దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే ఇప్పటికీ అదే పరిస్ధితి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో జగన్ కోర్టుకు హాజరైతే ఈ కేసులు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications