జగన్‌పై మరోసారి జెసి సంచలన వ్యాఖ్యలు: లోకేష్‌కు మంత్రి పదవి పైనా...
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇస్తారనే విషయంపై కూడా ఆయన స్పందించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డ్యామ్‌కు గండి పడిందని, నీళ్లు నిలిచే పరిస్థితి లేదని ఆయన అన్నారు. వెల్లువలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలోకి వస్తారని ఆయన అన్నారు. తండ్రిని చూపడం కాదు, తానేమిటో జగన్ నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

చంద్రబాబు చాలా తెలివైనవారని ఆయన కొనియాడారు. నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పు లేదని, సమర్థత చాటుకుంటే మంత్రిగా కొనసాగుతారని ఆయన అన్నారు. నియోజకవర్గాల పెంపునకు చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
రాజీవ్, సోనియా గాంధీల కుమారుడు కాబట్టే రాహుల్ గాంధీకి పదవి ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుమారుడు కెటి రామారావు మంత్రి అయినప్పుడు నారా లోకేష్ మంత్రి అయితే తప్పేమిటని జెసి అన్నారు. ప్రతిభ ఉన్నప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పేమీ లేదని అన్నారు.
లోకేష్ కోసం రాజీనామాలు చేస్తామని అనడం అంతా మెహర్బానీ మాటలు అని ఆయన బుద్దా వెంకన్న ప్రకటనను ఉద్దేశించి అన్నారు. కుల సంఘం తీర్మానించిందని లోకేష్‌ను మంత్రి చేయడం కాదని, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు తెలుసునని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు గానీ ఎమ్మెల్యే సీట్లను మాత్రం వెంకయ్య, చంద్రబాబు పెంచగలరని అన్నారు.












Click it and Unblock the Notifications