ఇంకా ఎంత దిగజారుతారు..? వెనక్కు తగ్గేదే లేదు - జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాల పైన మరోసారి ప్రశ్నించారు. విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు దీక్ష చేస్తున్న వేళ పోలీసుల సమక్షంలో దాడులు చేయటం పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంకా ఎంత వరకు దిగజారుతుందని నిల దీసారు. ఏం చేసినా.. తమ పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
సీఎం చంద్రబాబు లక్ష్యంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ చేసారు. కీలక అంశాలను ప్రస్తావించారు. అందులో.." మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే... దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? #DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు.." అని పేర్కొన్నారు.

పోరాటం కొనసాగుతుంది
దీనికి కొనసాగింపుగా.." చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? DSC-2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.." అంటూ జగన్ డిమాండ్ చేసారు. మీరు ఎన్న దాడులు చేసినా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని జగన్ తేల్చి చెప్పారు.



Click it and Unblock the Notifications