ys jagan stone attack case: జగన్ పై దాడి కేసు-బోండా ఉమకు బిగుస్తున్న ఉచ్చు?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపిన సీఎం జగన్ పై రాయి దాడి కేసులో విజయవాడ పోలీసులు క్రమంగా పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటికే 10 మంది వరకూ నగరంలోని వడ్డెర కాలనీ యువకుల్ని పిలిచి ప్రశ్నించిన పోలీసులు.. అందులో సతీష్ అనే యువకుడిని రాయి విసిరిన వ్యక్తిగా గుర్తించారు. ఆ తర్వాత ఇవాళ బోండా ఉమ ఆఫీసులో పనిచేసే వేముల దుర్గారావు అనే మరో యువకుడిని తీసుకెళ్లారు. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే రాయి విసిరిన ఘటనకు సంబంధించిన ఆధారాలు ఇస్తే రూ.2 లక్షలు నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించిన విజయవాడ పోలీసులు.. తాము కూడా ఆధారాల అన్వేషణలో ఉన్నారు. రాయి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దొరక్కపోవడంతో స్ధానికంగా ఉన్న యువకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే క్రమంలో వారికీ, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకూ ఉన్న సంబంధాల్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీంతో బోండా ఉమ కూడా అలర్ట్ అయ్యారు. తనకూ, సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకూ ఎలాంటి సంబంధం లేకపోయినా కొందరు పోలీసు అధికారులు తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా తన ఆఫీసులో పనిచేసే దుర్గారావు అనే వ్యక్తిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారన్నారు. దుర్గారావు తనకు ప్రతిరోజూ ఫోన్ చేసి కార్యక్రమాల షెడ్యూల్ చెప్తారని, కావాలంటే ఈ విషయం ఫోన్ రికార్డుల ద్వారా చూసుకోవచ్చన్నారు. అన్యాయంగా తనను ఇరికిస్తే మాత్రం జూన్ 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications