పవన్ కళ్యాణ్ ప్రశ్న: ఢిల్లీలో జగన్ ఆమరణ దీక్ష? ఫ్యామిలీతో విదేశాలకు బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన నిలదీయాలని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాత పలువురు స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయనున్నారు.
గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో జగన్ దీక్ష గురించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైయస్ జగన్ దీక్ష చేస్తారా లేక ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా తెలియాల్సి ఉంది. ఆగస్టు 10వ తేదీ లేదా 15వ తేదీన ఆయన జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నారు.
ఇటీవల ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అనంతపురం వచ్చి, తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎక్కడైనా పోరాడుతానని చెప్పారు. టిడిపి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ రాజధాని గ్రామాల్లో పొలాలు దున్నిన రైతులు
రాజధాని గ్రామాల్లో అసైన్డ్, సీలింగ్ భూముల సేకరణపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం పొలాలు దున్ని నిరసన తెలిపారు.
కుటుంబంతో సహా చంద్రబాబు విదేశీ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు మొదటి వారంలో కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏటా వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్తుంటారు.
విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: గంటా
ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కానుంది. సాగరతీరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ బీచ్ రోడ్‌లో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించే ప్రదేశాన్ని రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాస రావు, అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలు విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. విశాఖ బీచ్‌లోనే శకటాల ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications