రేపు వైసీపీ సీనియర్లతో జగన్ భేటీ-ప్రతీ నియోజకవర్గంలో మరో ఇన్ ఛార్జ్ ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార వైసీపీ వ్యూహాల్ని కూడా పదునుపెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విపక్షాల్ని పూర్తిగా కట్టడి చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు సొంత తప్పిదాలతో ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ రేపు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రేపు సాయంత్రం పార్టీ సీనియర్లతో జరిగే భేటీలో ఈ నిర్ణయం ప్రకటించబోతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలు నిర్వహిస్తోంది. ఇందులో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇందులో గత నాలుగున్నరేళ్ల కాలంలో సామాజిక న్యాయానికి తాము ఏ మేరకు ప్రాధాన్యం ఇచ్చామన్నది జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో విపక్షాల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రలు ఎలా సాగుతున్నాయో రేపు సీఎం జగన్ సమీక్షించబోతున్నారు.

రేపు తాడేపల్లిలో జరిగే కీలక భేటీలో సీఎం జగన్ తో వైసీపీ సీనియర్లు భేటీ కానున్నారు. ఇందులో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు ఇతర ఇన్ ఛార్జ్ లు కూడా ఉంటారు. ఇందులో సామాజిక సాధికారిక యాత్రలపై చర్చించడంతో పాటు ప్రతీ నియోజకవర్గానికి కొత్తగా ఒక కీలక వ్యక్తిని నియమించేందుకు వైసీపీ అధినేత కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ 175 మంది ఇలా ప్రత్యేక ఇన్ ఛార్జ్ లను నియమిస్తారు.
ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికల వ్యవహారాల్ని చక్కబెట్టడం వీరి పని. ఓటర్ లిస్ట్ పై అవవహన, కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా కీలక వ్యక్తి కి బాధ్యతలు అప్పగిస్తారు. వీరి నియామకాల్లో స్ధానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేసే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గ పోలింగ్ బూత్ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇది చాలా కీలకమని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications