YS Jagan: 46వేల ఎకరాలకు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైన వైఎస్ జగన్...
ఏపీలో భూమి లేని పేదలకు భూమిని అందిస్తూ, భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ, పేద రైతుల చిరకాల భూ సమస్యలకు చరమ గీతం పాడేందుకు వైఎస్ జగన్ సర్కార్ సిద్ధమైంది. రేపు ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్ ఏకంగా 46 వేల ఎకరాల అసైన్డ్, ఎల్పీఎస్ భూముల పత్రాల్ని లబ్దిదారులకు పంచబోతున్నారు. ఇందులో అసైన్డ్ తో పాటు ఎల్పీఎస్ భూమలు కూడా ఉన్నాయి. వీటిని దళితులతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల లబ్దిదారులకు అందిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వైసీపీ సర్కార్ 20,24,709 మంది పేదలకు 35,44,866 ఎకరాల్లో భూ పంపిణీ చేసి భూములపై సర్వ హక్కులు కల్పించింది. అలాగే కొత్తగా భూముల అసైన్మెంట్ భూమి లేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు.. ఇప్పటికే అసైన్డ్, గ్రామ సర్వీస్ ఇనామ్ , ఎస్సీ కార్పొరేషన్ (LPS) భూములు పొందిన వారికి వాటిపై సర్వ హక్కులు కల్పించే భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టబోతోంది.

ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దళితులకు స్మశాన వాటికలతో పాటు ఇతర పేదలకు భూముల కేటాయింపు పత్రాల్ని అందించబోతున్నారు. ఇందులో భాగంగా కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూముల పంపిణీ చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్/లీజు పట్టాలు ఇవ్వనున్నారు. అసైన్మెంట్ చేసి 20ఏళ్లు పూర్తయిన 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు కల్పిస్తారు.
1,563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తోంది. ల్యాండ్ పర్చేజ్ స్కీం (LPS) క్రింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ల రుణాలు మాఫీ చేయనున్నారు. దేశంలోనే తొలిసారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ఉద్దేశంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.
వందేళ్ల తర్వాత చేపట్టిన ఈ భూముల రీ సర్వే ద్వారా 17,595 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటి వరకు రెండు విడతల్లో 4 వేల గ్రామాల్లోని 42.6 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి చేశారు. అలాగే 17.53 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ చేశారు. 4.8 లక్షల మ్యూటేషన్లు 10.21 లక్షల కొత్త ల్యాండ్ సబ్ డివిజన్లు ఏర్పాటు చేశారు. 45 వేల సరిహద్దు వివాదాల పరిష్కారం చేశారు. రీసర్వే పూర్తయిన 4 వేల గ్రామాల్లో ఆ గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు. శుక్రవారం రెండో విడతలో 2వేల గ్రామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు.
20 ఏళ్లు పైబడ్డ అసైన్డ్ (DKT) భూములను, గ్రామ సర్వీసు ఇనామ్ భూములను, ఎస్సీ కార్పొరేషన్ (LPS) పంపిణీ చేసిన భూములను సెక్షన్ 22-ఏ నుండి తొలగించి ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి, వాళ్లకు ఆస్తిగా ఇస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది.












Click it and Unblock the Notifications