వీర విధేయుడికి మరో ఛాన్స్ ఇస్తున్న జగన్ ?
ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు పలు చోట్ల కొత్త ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. దీంతో కొన్ని కీలక స్ధానాల్లో తిరిగి పాత ఇన్ ఛార్జ్ లకే అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన నాలుగు జాబితాల్లో చేసిన పలు మార్పుల్ని పునఃపరిశీలిస్తున్న జగన్.. త్వరలో విడుదల చేసే ఐదో జాబితాలో వీటిని సరిదిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు ప్రకటించగానే తొలి జాబితాలో 11 అసెంబ్లీ నియోజవర్గాల్లో అభ్యర్ధుల్ని మార్చింది. దీంతో పలు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లు కోల్పోయారు. మరికొందరు ఇతర సీట్లకు మారారు. ఇంకొన్ని చోట్ల అసలు సీటే లేకుండా పోయారు. ఇలాంటి వారికి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా కొందరు ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకరికి ఇప్పుడు మరో ఛాన్స్ లభించేలా కనిపిస్తోంది. ఐదో జాబితాలో ఈ మేరకు ప్రకటన రానుంది.

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరు మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు. ఆయన గతంలో గెలిచిన రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా ఓటమిపాలవుతున్నారు. రాష్ట్రమంతా గత ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా రేపల్లెలో మాత్రం ఆయన ఓడిపోయారు. అయినా ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి జగన్ తన విధేయుడికి పట్టం కట్టారు. ఆ తర్వాత మండలి రద్దు ప్రతిపాదన రాగానే మంత్రి పదవి నుంచి తప్పించి ఎంపీగా గెలిపించి రాజ్యసభకు పంపారు.
అయితే తాజాగా రేపల్లె సీటులో ఈసారి కూడా మోపిదేవి గెలిచే అవకాశాలు లేవని తేలిపోవడంతో అక్కడ ఆయన స్ధానంలో ఈపూరు గణేష్ కు అవకాశం ఇచ్చారు. దీనిపై తొలుత అసంతృప్తి వ్యక్తం చేసిన మోపిదేవి వెంకటరమణ.. ఆ తర్వాత అధిష్టానం బుజ్జగించడంతో సర్దుకున్నారు. కానీ తాజాగా మారుతున్న పరిస్ధితుల్లో ఈపూరు గణేష్ కంటే మోపిదేవే బెటర్ అని అనుకున్నారో లేక మరో కారణమో తెలియదు కానీ ఆయనకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications