ఏప్రిల్ 3న ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ ! ముందస్తు సంకేతాలు ఇస్తారా ?
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ వైసీపీకి పరిస్ధితులు పూర్తి అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. దీంతో తాజా పరిస్ధితిపై సమీక్షించి తిరిగి పార్టీని గాడిన పెట్టేందుకు సీఎం జగన్ మరో సమీక్షకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 3న మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమీక్ష ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం పూర్తికావడంతో ఇక చేపట్టాల్సిన మిగతా కార్యక్రమాలతో పాటు గృహసారధుల నియామకం, పల్లె నిద్ర వంటి కార్యక్రమాలపై సమీక్షించేందుకు సీఎం జగన్ వచ్చే సోమవారం ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. గతంలో మార్చిలో ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ చేసేస్తానని చెప్పిన జగన్.. తాజా పరిణామాలతో మనసు మార్చుకునే అవకాశాలూ లేకపోలేదు. అలాగే మంత్రివర్గంలో మార్పులకూ సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని కాదని పట్టభద్రులు టీడీపీని రాష్ట్రంలోని మూడు చోట్ల గెలిపించడం, ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ గెలవాల్సిన ఏడో సీటును సొంత ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా కోల్పోవడం వైఎస్ జగన్ కు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తో భేటీ కావడంతో పాటు రెండు వారాల్లోనే రెండోసారి ఢిల్లీ టూర్ కు వెళ్లి వచ్చిన జగన్.. ఈసారి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేలతో సోమవారం జరిగే భేటీలో సీఎం జగన్ వారికి వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లే పక్షంలో సిద్దంగా ఉండాలని ఎమ్మెల్యేలను కోరబోతున్నారు. కేబినెట్లో మార్పులు చేపట్టే అవకాశం ఉంటే ఎమ్మెల్యేలకు ఆ విషయం చెప్పే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇలా పలు కీలక నిర్ణయాలకు ఈ భేటీ వేదిక కానుందన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications