చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు జగన్ మాస్టర్ స్ట్రోక్ ? రెండు దశాబ్దాల తర్వాత కీలక అడుగు..
ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయనకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో రాజకీయంగా పూర్తిగా పట్టు సాధించిన జగన్.. ఇప్పుడు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయాన్ని తిరగతోడటం ద్వారా జిల్లాలో రాజకీయంగా పాతుకుపోయేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. ఇవాళ జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్ అట్టహాసంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు.
ఏపీలో రెండు దశాబ్దాల క్రితమే పలు సహకార పాల డెయిరీలు మూతపడటం మొదలైంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. సీఎం చంద్రబాబు సొంత డెయిరీ హెరిటేజ్ కోసం వీటిని ఒక్కొక్కటిగా మూసేస్తూ వచ్చారు. వివిధ కారణాలతో ఈ డెయిరీలు మూతపడ్డాయి. అయితే ఇందులో అతిపెద్ద డెయిరీ చిత్తూరు డెయిరీ. దేశంలోనే రెండో అతిపెద్ద పాల డెయిరీగా ఉన్న చిత్తూరు డెయిరీని గతంలో చంద్రబాబు ప్రభుత్వం 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేస్తూ వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి చంద్రబాబు హయాంలోనే 2002లోఈ డెయిరీ మూతపడింది.

ఇప్పుడు రెండు దశాబ్దాల విరామం తర్వాత తిరిగి చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మూతపడిన ఈ డెయిరీని భారీ ఎత్తున వ్యయం చేయడం ద్వారా పునరుద్ధరిస్తే అక్కడి పాడి రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రూ.385 కోట్ల వ్యయంతో వచ్చే ఏడాది నాటికి దీన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనుల్ని సీఎం జగన్ ఇవాళ చిత్తూరులో ప్రారంభిస్తారు.

గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనుల్ని ఇవాళ ప్రారంభిస్తున్నారు. 2024 ఏప్రిల్ నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో లక్ష టన్నుల సామర్ధ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ యూనిట్ ద్వారా పాలతో పాటు ఇతర పాల ఉత్పత్తుల్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఇందులోనే రూ.150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ అనుకున్నట్లుగా పూర్తయితే చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఇక తిరుగుండదనే భావనలో ప్రభుత్వం ఉంది.












Click it and Unblock the Notifications