YSRCP Manifesto: వైసీపీ మ్యానిఫెస్టో విడుదలకు ముహుర్తం ఖరారు..!
ఏపీలో గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టో, సీట్ల పంపకాలు సహా అన్ని అంశాల్లో పక్కా వ్యూహంతో భారీ విజయం సాధించిన వైసీపీ.. ఈసారి దాన్ని రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి భారీ మ్యానిఫెస్టో విడుదలకు సిద్దమవుతోంది. త్వరలో సీఎం జగన్ విడుదల చేసే మ్యానిఫెస్టోను ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్ధులు జనంలోకి తీసుకెళ్తారు.
ఈ నెల 18న సీఎం జగన్ వైసీపీ తాజా మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 18న అనంతపురంలో జరిగే సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేస్తారని ఆయన వెల్లడించారు. సిద్ధం సభల సిరీస్ లో చివరిదైన అనంతపురం సభలో జగన్ కీలక ప్రసంగం చేయబోతున్నారని తెలిపారు.అది రాష్ట్రానికి దిశా దశను మార్చే విధంగా ఉంటుందన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ఏముంది అన్నది జగన్ కి మాత్రమే తెలుసని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

భువనేశ్వరి నిజం గెలవాలని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదని, జగన్ అంటేనే నిజం.. నిజం అంటే జగన్.. అందుకే ఆయన గెలుస్తారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఒక్క సీటు కూడా టీడీపీకి లేకపోవడం ఆ పార్టీ పతనావస్థకు నిదర్శనమన్నారు. ఇరిగేషన్ విషయంలో సీఎం జగన్ ఏం చేశారో తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారని,ఆ ప్రసంగం విన్న తర్వాత టీడీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఏమి చేయలేదన్న దానికి మీ సమాధానం ఏంటన్నారు. లోకేష్ టీడీపీ ఏం చేసింది, ఏం చేస్తాం అన్నది చెప్పడని, చంద్రబాబు, లోకేష్, షర్మిల అందరూ జగన్ ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు.

2018లో 60 లక్షలకు పైగా దొంగ ఓట్లు టీడీపీ వారు నమోదు చేయించారని, వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. ఐఏఎస్ లను, ఐపీఎస్ లను బెదిరించడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటన్నారు. తాము ఫ్రీ అండ్ ఫేర్ గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నట్లు పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications