15 వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరికలు-ఇద్దరు మంత్రులూ ? పనితీరు మార్చుకుంటేనే టికెట్లు !
ఏపీలో వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలతో మరోసారి భేటీ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ఇందులో సీఎం జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఈసారి 15 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని గుర్తించారు. వారికి ప్రత్యేక హెచ్చరికలు చేశారు.

ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఐప్యాక్ టీమ్ అందించిన సర్వే నివేదికల ఆధారంగా ఇవాళ మరోసారి వైఎస్ జగన్ వారితో చర్చించారు. ఇందులో ఇద్దరు మంత్రుల సహా 15 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని గుర్తించినట్లు చెప్పిన జగన్.. వారి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు. గతంలో పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను గుర్తించి వారి పేర్లను చదివిన జగన్.. ఈసారి మాత్రం ఆ కార్యక్రమం పెట్టలేదు. కేవలం 15 మంది పనితీరు బాగోలేదని తాజా నివేదికల ఆధారంగా గుర్తించినట్లు చెప్పిన జగన్.. వారి గురించి పరోక్షంగా మాట్లాడారు.
పనితీరు బాగోలేదని గుర్తించిన 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నేరుగా వారి పనితీరుకు సంబంధించిన వివరాలు సీఎంవో ద్వారా పంపాలని నిర్ణయించారు. వాటి ఆధారంగా సదరు ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం జగన్ వారికి సూచించారు. లేకపోతే మాత్రం వారికి టికెట్లు ఇవ్వలేనని, ఆ తర్వాత తనను తప్పుబట్టొద్దని ఆయా ఎమ్మెల్యేలను కోరారు. దీంతో ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరన్న విషయంలో సస్పెన్స్ నెలకొంది.
మరోవైపు పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇస్తే వారికీ నష్టం, పార్టీకి నష్టమని సీఎం జగన్ తేల్చిచెప్పేశారు. గడప గడపకూ కార్యక్రమం వల్ల వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని, అలా జరగకపోతే మాత్రం అభ్యర్ధులను మార్చక తప్పదన్నారు. వచ్చే 9 నెలలూ తమకు కీలకమని, 175 సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యేలకు గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని కూడా జగన్ సూచించారు.
సర్వేల ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని జగన్ స్పష్టం చేశారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని జగన్ మరోసారి ఆదేశించారు. ఇప్పటికే వైసీపీతో విభేదించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసిన నలుగురు సస్పెండ్ అయ్యారు. వీరు కాకుండా 15 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వీరంతా ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. అటు జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా పథకాలు అందని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకోవాలని జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications