జగన్ తప్పు చేశాడు, శిక్ష తప్పదు: సిద్ధంగా ఉండాలని బాబు పిలుపు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంలో నాయకత్వ శూన్యత ఉందని అన్నారు. ప్రతిపక్షంలో గట్టి పార్టీలు లేవని అభిప్రాయపడ్డారు.

జగన్‌కు శిక్ష తప్పదు..
అంతేగాక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ నాటికీ పైకి లేవదని, ఆ పార్టీ నేత తప్పు చేశాడని.. అతనికి శిక్ష తప్పదని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయనకు శిక్ష ఇవాళ కాకపోతే రేపు.. అంతే తప్ప శిక్షను మాత్రం తప్పించుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పరిస్ధితిని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేతలకు, శ్రేణులకు పిలుపిచ్చారు.

అభివృద్ధికి అడ్డుపుల్లలు..
ప్రజల్లోకి ఇంకా వెళ్లి మనం చేసిన మంచి చెప్పి మన వైపు తిప్పుకోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన పార్టీ వర్క్ షాప్‌లో ఆయన ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా దానికి అడ్డుతగలడమే పనిగా జగన్ పార్టీ పెట్టుకుందని, చివరకు పులివెందులకు నీరు వస్తున్నా జగన్ అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు.

వార్నింగ్ ఇస్తే గానీ..
గాలేరు-నగరి పనుల్లో ఒకచోట వైసీపీకి చెందిన పీఏసీ చైర్మన్ అడ్డుతగిలి పెద్ద గొడవ చేశాడని, గట్టి వార్నింగ్ ఇచ్చాక గాని సహకరించలేదని చంద్రబాబు అన్నారు. కర్నూలులో విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేశానని, ఆ పక్కనే ప్రభుత్వ భూమిలో మైనింగ్ చేస్తున్న జగన్ పార్టీ నాయకుడొకరు.. ఈ పనులకు అడ్డు తగలడానికి ప్రయత్నించాడని చెప్పారు.

అలా జగన్ ప్రయత్నాలను నిరోధించాం
జగన్ పార్టీ నేతలు రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేశారని చంద్రబాబు అన్నారు. తమిళనాడులో జల్లికట్టుకు, మనకు ఏం సంబంధం? అది స్ఫూర్తి అంటూ విశాఖ బీచ్‌లో సరిగ్గా ఇన్వెస్టర్ల సదస్సుకు ముందు ధర్నాలు.. ఆందోళనలు చేయాలని చూశారని మండిపడ్డారు. మనం గట్టిగా ఉండి ఆ ప్రయత్నం నిరోధించామని టీడీపీ శ్రేణులతో అన్నారు.

ఆ భూముల విషయంలోనూ అంతే..
ఇక సదావర్తి సత్రం భూములపైనా అదే తీరని, గతంలో వేలంలో పాడుకున్న వారి కంటే ఎక్కువిస్తే ఆ భూములు ఇస్తామని ముందే చెప్పామని, అయినా వినకుండా కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. కోర్టు కూడా రూ. 5కోట్లు అదనంగా ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని ఆదేశించిందని గుర్తు చేశారు. వాళ్లు నిజంగా డబ్బులు కడితే సత్రానికి అదనంగా డబ్బులు వస్తాయని, ఇంకా అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications