ఫలితం లేదు: బీజేపీ ప్లాన్‌పై జగన్‌కు క్లారిటీ, అందుకే మళ్లీ 'ప్రత్యేక' గళం?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మళ్లీ తనదైన దారిలో వెళ్తున్నారా? బీజేపీ పైన ఆయన ఆశలు నీరుగారిపోయాయా? అంటే అవుననే అంటున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మళ్లీ తనదైన దారిలో వెళ్తున్నారా? బీజేపీ పైన ఆయన ఆశలు నీరుగారిపోయాయా? అంటే అవుననే అంటున్నారు.
అంతకుముందు జగన్ ప్రత్యేక హోదాపై వరుస సభలు నిర్వహించారు. యువభేరీ పేరుతో హోదా అంశాన్ని యువతలోకి తీసుకు వెళ్లారు.
ఆ తర్వాత ప్రధాని మోడీని కలిశాక హోదాపై జగన్ మాటలో తేడా కనిపించింది. ఇప్పుడు మళ్ళీ హోదాను ఎత్తుకుంటున్నారు. దీనికి బీజేపీ ఆయనను దూరం పెట్టాలని చూడడమే కారణమని అంటున్నారు.

మళ్లీ జగన్ యువభేరీ
వైయస్ జగన్ ఈ నెల 10వ తేదీన (మంగళవారం) అనంతపురంలో యువభేరీ సభను నిర్వహించనున్నారు. ఇప్పుడు దీనిపై అందరి దృష్టి పడింది. యువభేరీ సభల్లో జగన్ ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తున్నారు. తిరుపతి, విశాఖ, కాకినాడ, శ్రకాకుళం, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, విజయనగరం, గుంటూరులలో గతంలో యువభేరీలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాని మోడీని కలిసిన తర్వాత సైలెంట్ అయ్యారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు తిరిగి అనంతలో యువభేరీ నిర్వహిస్తున్నారు.

ఇదీ బీజేపీ ప్లాన్
ఏపీలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలకు ధీటుగా ఎదగాలని బిజెపి భావిస్తోంది. 2014లో టిడిపితో పొత్తు కారణంగా అదే కొనసాగుతున్నందున ఏపీలో సరిగా ఎదగడం లేదని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. అధికారం కోసం అర్రులుచాచే జగన్‌తో 2019లో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని బిజెపి భావిస్తోందని సమాచారం.

పవన్ కళ్యాణ్‌తో ఉంటేనైనా ఎదగొచ్చు
టిడిపి, వైసిపిలకు బదులు అవసరమైతే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనతో పొత్తు పెట్టుకుంటే మంచిదని బిజెపి భావిస్తోంది. జనసేనతో పొత్తు కోసం కొన్ని మెట్లు దిగేందుకైనా అది సిద్ధంగా ఉంది. జనసేనతో ఉంటే బిజెపి ఎదుగుతుందని భావిస్తోంది.

జగన్‌కు క్లారిటీ, అందుకే దేవుళ్ల చుట్టూ
బిజెపి విషయంలో జగన్‌కు ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. తనతో పొత్తుకు ఆ పార్టీ సిద్ధంగా లేదని ఆయనకు అర్థమైందని అంటున్నారు. ఇటీవల ఆయన చినజీయర్ స్వామికు పాదాభివందనం చేయడం, పాదయాత్రను తిరుమల నుంచి ప్రారంభించడం వెనుక బిజెపితో పొత్తు కోసం కావొచ్చుననే ప్రచారం జరిగింది. కానీ బిజెపి దూరమైనా హిందువుల ఓట్ల కోసం ఆయన ఇలా చేస్తున్నారని అంటున్నారు.

అప్పుడే క్లారిటీ వచ్చిందా?
కొద్ది రోజుల క్రితం జగన్ హైదరాబాదులో బిజెపి నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే పొత్తు విషయమై ఆయనకు ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. ఎక్కువ సీట్లు ఇస్తే టిడిపితో లేదా ఒంటరిగా లేదా పవన్ కళ్యాణ్‌తో వెళ్లేందుకు బిజెపి సుముఖత చూపుతున్నట్లుగా ఆయనకు అర్థమైందని అంటున్నారు.

అందుకే మళ్లీ యువభేరీ
2019లో ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్న జగన్ బీజేపీ విషయమై తనకు ఓ స్పష్టత వచ్చాక మళ్లీ ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు మళ్లీ ప్రత్యేక హోదాపై మళ్లీ యువభేరీ వంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు.












Click it and Unblock the Notifications