జడ్జి కుర్చీపై క్షుద్ర పూజలు.. 65 ఏళ్ల బామ్మ బిగ్ స్కెచ్!
కేసుల్లో గెలవడం కోసం కోర్టులో లాయర్ల ద్వారా గట్టిగా వాదనలు వినిపించడం చూస్తుంటాం. కానీ, కర్ణాటకలో ఓ వృద్ధురాలు మాత్రం ఏకంగా కోర్టు హాల్లోనే క్షుద్ర పూజలకు తెరలేపింది. తన కుటుంబానికి సంబంధించిన సివిల్ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావాలని ఏకంగా జడ్జి కుర్చీపైనే మంత్రించిన ఆవాలు చల్లి పోలీసులకు చిక్కింది. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోర్టు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వృద్ధురాలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కబల్లాపూర్‌కు చెందిన 65 ఏళ్ల మంజుల అనే వృద్ధురాలి కుటుంబానికి సంబంధించిన ఒక సివిల్ వివాదం స్థానిక కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో మూడో ప్రతివాదిగా ఆమె సోదరుడు వెంకటరామ ఉన్నాడు. కోర్టులో నడుస్తున్న ఈ కేసు ఎలాగైనా తమకు అనుకూలంగా మారాలని, జడ్జి మనసు మార్చాలనే ఉద్దేశంతో ఆమె మూఢనమ్మకాన్ని నమ్ముకుంది. జూలై 9వ తేదీ ఉదయం గం. 9:40 నిమిషాల ప్రాంతంలో కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఆమె గుట్టుచప్పుడు కాకుండా మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లోకి ప్రవేశించింది.

సీసీటీవీ కెమెరాల్లో గుట్టు రట్టు!
మంత్రాల ద్వారా జడ్జిని వశం చేసుకోవచ్చనే గుడ్డి నమ్మకంతో ఆమె వెంట తెచ్చుకున్న తెల్ల ఆవాలను జడ్జి కూర్చునే కుర్చీపై, అలాగే ఆయన కూర్చునే ఎత్తయిన డయాస్ పై చల్లింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి కోర్టు సిబ్బంది లోపలికి వచ్చి పరిశీలించగా.. జడ్జి కుర్చీపై తెల్లటి ఆవాలు పడి ఉండటం గమనించారు. దీంతో అనుమానం వచ్చి కోర్టులోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను తనిఖీ చేయగా, వృద్ధురాలు లోపలికి వచ్చి ఆవాలు చల్లుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
ఈ ఘటనపై కోర్టు ప్రధాన పరిపాలనా అధికారి నేత్ర చిక్కబల్లాపూర్ టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జూలై 11న నిందితురాలు మంజులను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై 'కర్ణాటక అమానవీయ దురాచారాలు - క్షుద్ర పూజల నిరోధక చట్టం - 2017' కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కోర్టు హాల్లోనే ఇలాంటి మూఢనమ్మకాలతో పూజలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications