జగన్ అన్నగారు.. ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? వైఎస్ షర్మిల సూటిప్రశ్నలు!!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని పదేపదే టార్గెట్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న APCC చీఫ్ వైఎస్ షర్మిల ఏపీలో తాజా పరిస్థితులపై తనదైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీ నాకంటే మీ అందరికీ తెలుసు అని పేర్కొన్న షర్మిల ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా వుండేదన్నారు.
ప్రత్యేక హోదా సాధించడంలో TDP, YCP లు మోసం చేశాయని మండిపడ్డారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలో వచ్చాక మరచిపోయారని, హోదా అడిగితే జైల్లో పెట్టించారన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తానన్నారు. జగన్ అన్న గారు అధికారంలో వచ్చాక స్వలాభం కోసం చూశారని షర్మిల ఎద్దేవా చేశారు.

ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా హోదా పై జగన్ అన్న గారు ఉద్యమం చేసింది లేదని మండిపడ్డారు. హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. జగన్ అన్నగారు అధికారంలోకి వచ్చాక జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడని, 4న్నరేళ్లు మోసం చేసి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటున్నాడని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు వచ్చేవి ఎన్నడు జగన్ సార్ అంటూ ప్రశ్నించారు.
శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం చేశానని పేర్కొన్న షర్మిల మహిళలు చెప్పిన అనేక అంశాలు తనకు బాధను కలిగించాయి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం దొరుకుతుందని, ధరలు పెంచి మరీ మద్య విక్రయం జరుగుతుందని, పేదల ఇళ్లను మరింత గుల్ల చేస్తున్నారని చెబుతున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. మద్యనిషేధం చేయకపోతే ఓట్లు కూడా అడగను అన్న జగన్ అన్నగారు, మద్యనిషేధం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా వదిలేశారని, అభివృద్ధిని పక్కనపెట్టి టీడీపీ, వైసీపీలు బిజెపి జపం చేస్తున్నాయని, బిజెపికి రెండు పార్టీలు బానిసలుగా మారాయని వైయస్ షర్మిల మండిపడ్డారు. బిజెపిని వద్దని ఆంధ్రరాష్ట్రం తిరస్కరిస్తే, వీళ్ళు మాత్రం బిజెపితో దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. పూర్తిగా బిజెపికి అమ్ముడుపోయారని నిప్పులు చెరిగారు.
ప్రజలు వద్దనుకున్న బిజెపికి ఎందుకు అమ్ముడు పోయారో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చిత్తశుద్ధి కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications