తెలంగాణా కోడల్ని నమ్మకండి: వైఎస్ షర్మిలను ఏకిపారేస్తున్నారుగా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల పైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుత వైసిపి పాలన పైన నిప్పులు చెరుగుతున్నారు. గతంలో పరిపాలన సాగించిన చంద్రబాబు పాలనలో కూడా ఏపీలో జరిగిందేమీ లేదని, ఏపీ ప్రజలకు వచ్చిన లాభమేమీ లేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక మరోవైపు బిజెపిని తూర్పార పడుతున్నారు. ఇక ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ షర్మిలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు, తాను చదివింది ఇక్కడ, తాను బతికింది ఇక్కడ, తన ఉనికి తెలంగాణ అని చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏ ముఖంతో ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి, ఆయన అభిమానులను షర్మిల మోసం చేశారని, ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి, పోటీ నుండి తప్పుకుని, పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి నమ్మిన వారిని నట్టేట ముంచారని మండిపడుతున్నారు. తెలంగాణ కోడలిని అని చెప్పుకునే వైఎస్ షర్మిలను నమ్మొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, చనిపోయిన తర్వాత ఆయన పైన కేసులు పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల, ఇప్పుడు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీనే చేస్తుందని, ఏపీలో అభివృద్ధి జరగాలంటే, ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
మీరేం చెప్తే అది నమ్మి వెర్రివాళ్ళు ఏపీ ప్రజలు కాదని, పొరపాటున కూడా షర్మిలను నమ్మబోరని సోషల్ మీడియా వేదికగా పోస్టల్ పెడుతున్నారు. ఒక పక్క షర్మిల ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో, అక్కడి రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తే, గతంలో తెలంగాణలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసినప్పుడు షర్మిల మాట్లాడిన మాటల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెపై ఎదురుదాడి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications