చంద్రబాబుకు షర్మిల టీం అల్టిమేటం - కలుస్తారా, జగన్ ను గెలిపిస్తారా..!!
ఏపీ రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది. ఏపీలో బాధ్యతల పైన క్లారిటీ రావాల్సి ఉంది. షర్మిల కాంగ్రెస్ లోకి రావటం ద్వారా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే కొత్త పొత్తుల లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ,జనసేన బీజీపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న వేళ..షర్మిల టీం చేస్తున్న కీలక ప్రతిపాదనలు సంచలనంగా మారుతున్నాయి.
షర్మిల ఎంట్రీ వేళ:షర్మిల రేపు (జనవరి 4) అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ కోసం పని చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. అయితే, ఏఐసీసీ కోసమా.. ఏపీ కోసమా అనేది పార్టీలో చేరిన తరువాత స్పష్టత ఇస్తానని షర్మిల వెల్లడించారు. చాలా రోజుల తరువాత షర్మిల తన అన్న జగన్ ను ఈ రోజు కలవబోతున్నారు. తన కుమారుడు నిశ్చితార్ధం, వివాహం గురించి వివరించి ఆయనను ఆహ్వానించనున్నారు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సమయంలోనే షర్మిల వైఎస్సార్టీపీ ఏర్పాటు నుంచి నేడు కాంగ్రెస్ లో చేరిక వరకు వైఎస్సార్టీపీలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి షర్మిల రాజకీయ భవిష్యత్ గురించి కీలక అంశాలు వెల్లడించారు.

కొత్త సమీకరణాలు:షర్మిల ఏపీలోనే రాజకీయం చేస్తారని దేవేందర్ రెడ్డి స్పష్టం చేసారు. ఒక టీవీ చర్చలో ఏపీలో షర్మిల పాత్ర గురించి వివరించారు. ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల రాకతో బలం పెరుగుతుందన్నారు. ఏపీలోనే షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. కాంగ్రెస్ కోరుకున్న విధంగా షర్మిల పని చేస్తారని తేల్చి చెప్పారు. జగన్ పైన వ్యక్తిగతంగా కాకుండా వైసీపీ పైన పోరాటం ఉంటుందన్నారు. పాదయాత్ర, పోటీ పై పార్టీ ఏం చెబితే అదే చేస్తారని చెప్పుకొచ్చారు. గతంలో వివేకా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పైన పోటీ చేసిన అంశాన్ని గుర్తు చేసారు. రాజకీయాల్లో నిర్ణయం తీసుకున్నాక తన, మనం బేధం ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిన తరువాత ఏపీలో ముఖ్యుల చేరికలు ఉండే అవకాశం ఉందన్నారు. ఇక..ఏపీలో పొత్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పొత్తుల లెక్కలు:ఏపీలో చంద్రబాబు, పవన్ కాంగ్రెస్ తో కలిస్తే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు కలవకకపోతే ఇప్పుడున్న పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. కలవాలా వద్దా అనేది చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన రాలేదు. సంక్రాంతి లోగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ పొత్తుకు నో చెబితే చంద్రబాబు ఏం చేస్తారనేది కీలకంగా మారనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీకి సిద్దం అవుతోంది. దీంతో ఏపీలో త్రిముఖ పోరులో ఓట్ల చీలక..సమీకరణాలు ఎవరికి మేలు చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications