ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకం: కాంగ్రెస్‌కు వైఎస్ కుటుంబమే దిక్కయింది
YS Sharmila: ఊహించినట్టే- వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవలే దేశ రాజధాని వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కొత్త బాధ్యతలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన జారీ చేశారు.
Recommended Video

నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన గిడుగు రుద్రరాజుకు ప్రమోషన్ లభించింది. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అపాయింట్ అయ్యారు. దీనితో ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెలి మధ్య పోటీ నెలకొన్నట్టయింది.

వైఎస్ షర్మిల ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. అనంతరం సోనియాగాంధీతోనూ ఆమె సమావేశం అయ్యారు. గతంలో తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని.. కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం అంటే మాటలు కాదు. 2009లో చంద్రబాబు నెలకొల్పిన మహాకూటమిని ఎదుర్కొని, ప్రత్యేక తెలంగాణవాదాన్ని తట్టుకుని తిరుగులేని విజయాన్ని అందుకుంది.
విభజన తరువాత ఆ రోజులు ముగిశాయి. కాంగ్రెస్ చరిత్ర గత వైభవంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా చీకటి రోజులను చవి చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన కాంగ్రెస్‌ను సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేశారు. సమీప భవిషత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేశారు.

రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ బలంగా విశ్వసించింది. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకే పార్టీ పగ్గాలను అప్పగించింది. దీనితో ఏపీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారినట్టయింది.
ఏపీలో వైఎస్ కుటుంబం మధ్యే మళ్లీ పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతలందరూ కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తారనడంలో సందేహాలు అక్కర్లేదు. వైసీపీలో టికెట్ రాని నేతలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications