కోర్టు వద్దన్నా సరే.. వివేకా హత్యకేసు నిందితులొకవైపు; ధర్మమొకవైపు: వైఎస్ షర్మిల సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. కడపకోర్టు వివేకా హత్య కేసుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని వైయస్ షర్మిల, సునీతలతో పాటు అన్ని పార్టీలవారికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ తాజాగా వైఎస్ షర్మిల మళ్లీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ కు లక్ష్మణుడిలా వైఎస్ వివేకా
కడప జిల్లా పెద్దముడియం మండలంలో షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శనాస్త్రాలను సంధించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైయస్ వివేకానంద రెడ్డి అలాగే అని చెప్పిన షర్మిల వివేకానంద రెడ్డిని ఏడు సార్లు గొడ్డలితో క్రూరంగా నరికి దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ వద్ద అన్ని ఆధారాలున్నాయి
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు అయిపోయిందని, ఇంతవరకు ఆ హత్య కేసులో ఎటువంటి న్యాయం జరగలేదని షర్మిల పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అంటే ఎంతో ఇష్టమని, ఇక అటువంటి వ్యక్తిని చంపిన వారిని వైఎస్ జగన్ కాపాడుతున్నారు అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ప్రతి ఆధారం సిబీఐ వద్ద ఉందన్నారు.
అవినాష్ రెడ్డిని కాపాడుతున్న వైఎస్ జగన్
ఆయనను ఎవరు హత్య చేశారో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసని వైయస్ షర్మిల పేర్కొన్నారు. వైయస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడని కూడా జగన్ కు తెలుసనీ, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని సిబిఐ అధికారులు ప్రయత్నించినప్పుడు అక్కడ కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని, అవినాష్ ను అరెస్ట్ చేయకుండా జగన్ అన్ని విధాల అడ్డు పడ్డారని వైయస్ షర్మిల విమర్శించారు.
సీబీఐ విచారణ జరుగుతుంటే జగన్ కు భయమెందుకు
వివేకా హత్య కేసు నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసును సిబిఐ విచారణ జరుపుతుంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్, అధికారంలోకి రాగానే వద్దన్నారని షర్మిల గుర్తు చేశారు.
కొంగు చాచి అడుగుతున్నా
వివేకా హత్య కేసు నిందితులు ఒకవైపు, న్యాయం, ధర్మం మరోవైపు నిలబడి ఉన్నామని, కొంగు చాచి అడుగుతున్నానని, న్యాయం వైపు నిలబడమని వైఎస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డగా ఇక్కడే ఉంటానని, మీ బలం, మీ గొంతు గా ఉంటానని షర్మిల పేర్కొన్నారు. నా జీవితాన్ని మీకే అంకితం చేస్తానని చెప్పిన షర్మిల తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications