ట్రాక్ ఎక్కిన వైఎస్ షర్మిల?
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ప్రదేశ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు.
చంద్రబాబు తాజాగా విడుదల చేసిన విజన్ 2047పై షర్మిల విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రం దశ- దిశ మారాలంటే కావాల్సింది విజన్లు కాదని, విభజన హామీలని హితవు పలికారు షర్మిల.

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలనని పేర్కొన్నారు. దశాబ్దకాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని, పూర్తిగా అటకెక్కించారంటూ ధ్వజమెత్తారు. విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు.
కొత్త రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని కూడా నాటి యూపీఏ సూచించిందని పేర్కొన్నారు. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసిందని, మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పొందపరించిందని చెప్పారు.
కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామంటూ యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో హామీ ఇచ్చిందని షర్మిల చెప్పారు. అలాగే రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్.. ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయని, ఒక్క హామీకి కూడా దిక్కులేకుండా పోయిందని మండిపడ్డారు.
పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవని షర్మిల చెప్పారు. ఫలితంగా వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని, లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవని షర్మిల చెప్పుకొచ్చారు.
విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగనేనని ధ్వజమెత్తారు. ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని, హోదా అయిదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మోదీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అంటూ చంద్రబాబు జనం చెవుల్లో పూలు పెట్టారని ఎద్దేవా చేశారు.
25 మంది ఎంపీలు ఇస్తే హోదా ఎందుకు ఇవ్వరో చూస్తాంటూ శపథం చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఎప్పటికైనా రాష్ట్రాభివృద్ధికి సంజీవని వంటిది ప్రత్యేక హోదా మాత్రమేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం మోదీ జుట్టు చంద్రబాబు చేతుల్లో ఉందని, విభజన హామీలపై ప్రధానిని నిలదీయాలని, కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications