వైఎస్సార్సీపీలో వైఎస్సార్ నాది: షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల టిడిపి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను చెప్పి అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిందని ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదని, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో విజయవంతమైన ఈ పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
కూటమి సర్కార్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అతీగతీ లేదన్నారు. తల్లికి వందనం పేరుతో తీసుకు వస్తున్న పథకంలో క్లారిటీ లేదని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోడానికి ఒక్కొక్కరికి 15000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలా ఇస్తారో తెలియకుండా జీవో విడుదల చేశారన్నారు.

జగన్ చెప్పిన అబద్ధపు హామీ నేను కూడా ప్రచారం చేశాను
ఇక ఇదే సమయంలో జగన్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల గతంలో జగన్ కూడా అమ్మ ఒడి పథకం ద్వారా ప్రజలను అట్లానే మోసం చేశారన్నారు. జగన్ ఇచ్చిన హామీని తాను కూడా గతంలో ప్రచారం చేశానని కానీ జగన్ కూడా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై గందరగోళం సృష్టించారని పేర్కొన్న షర్మిల గతంలో వైఎస్ఆర్ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటే ఇప్పటి ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడే ప్రయత్నం చేయలేదన్నారు.
వైసీపీలో వైఎస్సార్ లేడు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలన్నారు. రాత్రి పడిన గుంతలోనే పగలు పడ్డట్టు ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి అంటూ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నానని, వైయస్సార్ వైసిపి నాయకుడు కాదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ లేడన్నారు. వైయస్సార్ అందించిన పథకాలు, ఆయన ఆశయాలు వైసీపీలో లేవని ఒకవేళ ఉంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి
వైయస్సార్ పూర్తిగా కాంగ్రెస్ మనిషని కాంగ్రెస్లోనే బ్రతికారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది వైసిపి అని, బిజెపి తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతు తెలిపింది వైసిపి అని బిజెపితో వైసిపి అక్రమ సంబంధం పెట్టుకుందన్నారు. ఇంకోసారి వైఎస్ఆర్ విగ్రహాలను పగలగొడితే ఊరుకునేది లేదని స్పష్టం చేసిన షర్మిల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని అక్రమ పొత్తులేనని బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అంటూ మండిపడ్డారు.
జగన్ ను లాజిక్ తో కొట్టిన షర్మిల
వైయస్సార్ మీద ప్రేమ ఉంటే 75వ జయంతి రోజు ఏం కార్యక్రమాలు చేశారో చెప్పాలన్నారు. వందల కోట్లు సిద్ధం సభలకు ఖర్చుపెట్టిన మీరు వైఎస్ఆర్ జయంతికి ఏం చేశారు అని నిలదీశారు. వైయస్సార్ ఘాట్ వద్ద ఐదు నిమిషాలు తూతూ మంత్రంగా నివాళులర్పిస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై కొట్లాడాలని, కేంద్రం వద్ద రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలని సూచించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నడపలేమని చెప్పడం కరెక్ట్ కాదని ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వైయస్ షర్మిల సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications