మౌనంగా ఎందుకు ఉన్నారు సార్- అదానీ మీకు ఎంత లంచం ఆఫర్ చేశారు?
YS Sharmila: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకి)తో కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పుపట్టారు. ఈ ఒప్పందంలో భారీ అవినీతి చోటు చేసుకుందంటో ఆరోపణలు గుప్పించారు.
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమేనని, మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన 1,750 కోట్ల రూపాయల ముడుపులపై విచారణ ఎక్కడ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు షర్మిల. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ అదానీ అక్రమ డీల్‌పై ఎందుకు పెట్టలేకపోతున్నారని అన్నారు.

అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వానిది కాదా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. చంద్రబాబు కూడా అదానీకి అమ్ముడుపోయారా? అంటూ అనుమానాలను వ్యక్త పరిచారు.
తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు? అంటూ చంద్రబాబుకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ- సెకితో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపించిందని షర్మిల గుర్తు చేశారు. టెండర్లు లేకుండా అదానీకి విద్యుత్ సరఫరాను కట్టబెట్టారంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టేనని టీడీపీ నాయకులు నానా యాగీ చేశారని అన్నారు.
గుజరాత్‌లో రూ 1.99 పైసలకే దొరికే సోలార్ విద్యుత్‌ను వైఎస్ జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని టీడీపీ ప్రశ్నించిందని, ఉద్యమాలు చేసిందని షర్మిల చెప్పారు. 25 సంవత్సరాల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని ధ్వజమెత్తారు. ఇది- అదానీ కోసం ప్రజలను నిలువునా దోచి పెట్టడమేనని పేర్కొన్నారు.
ఈ డీల్ రద్దు చేయాలంటూ ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారని చెప్పారు. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తామంటూ గొప్ప మాటలు చెప్పారని, ఇప్పుడవన్నీ ఏమయ్యాయని, అన్ని ఆధారాలు, అధికారాన్ని దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ అని ప్రశ్నించారు.
అప్పుడు జగన్ అదానీకి అమ్ముడు పోయారు.. ఇప్పుడు చంద్రబాబు అమ్ముడు పోయారు అనే కదా అర్థం అంటూ ఘాటుగా విమర్శించారు షర్మిల. అదానీ చంద్రబాబును కొనకపోతే, ఆ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమమే అయితే, వెంటనే ఏసీబీని పంజరం నుంచి విడుదల చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications