కాంగ్రెస్ ఆఫీసులో నేలపైనే షర్మిల నిద్ర- డీఎస్సీపై నిరుద్యోగులకు సారీ చెప్పాలని డిమాండ్..
ఏపీలో ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో కేవలం 6100 పోస్టులు మాత్రమే ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో ఇవాళ ఛలో సెక్రటేరియట్ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాంగ్రెస్ నేతల్ని, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో నేలపైనే నిద్రించి నిరసన తెలిపారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోరుతూ ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీంతో ఏదైనా హోటల్ లో దిగినా హౌస్ అరెస్టు చేస్తారనే భయాలతో వైఎస్ షర్మిల నిన్నటి నుంచి విజయవాడ ఆంధ్రరత్న భవన్ లోనే ఉన్నారు. చివరికి రాత్రి కూడా తన కార్యాలయంలోనే నేలపైనే పడుకున్నారు. పరుపు వేసుకుని నేలపైనే పడుకున్న షర్మిల ఫొటోలు వైరల్ అయ్యాయి.
వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. దీన్ని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసుల్ని పెట్టారని, ఇనుప కంచెలు వేసి బందీలు చేశారని విమర్శించారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. తమను ఆపాలని చూస్తే ముమ్మాటికీ నియంతలే అవుతారన్నారు.
ఆంధ్ర రత్న భవన్ లో నేలపైనే నిద్రించిన వైఎస్ షర్మిల..!!#YSSharmila #APCC #Congress #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/8eH4uXkL9Z
— oneindiatelugu (@oneindiatelugu) February 22, 2024
ఇవాళ ఛలో సెక్రటేరియట్ కు వెళ్తున్న సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీని వెంటనే విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications