YS Sharmila: షర్మిలకు ఢిల్లీ పిలుపు-ఎల్లుండే కాంగ్రెస్ లో చేరిక-కాసేపట్లో ఇడుపులపాయలో ప్రకటన..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్టీపీని (YSRTP) స్ధాపించి ప్రభావం చూపలేకపోయిన మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో అన్ని విషయాలు మాట్లాడుకున్న షర్మిల.. ఎల్లుండి లాంఛనంగా ఆ పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఇవాళ ఇడుపులపాయలో కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇవాళ జరుగుతున్న వైఎస్సార్టీపీ భేటీ చివరిది కానుంది.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికకు ఈ నెల 4న ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు జాతీయ మీడియాకు ధృవీకరించాయి. ఈ నెల 4న అంటే ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు. అనంతరం వరుసగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 4వ తేదీన ఢిల్లీ రావాలని షర్మిలకు ఆహ్వానం కూడా అందింది.

ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్సార్టీపీ నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ఇందులో కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనంతో పాటు తమ చేరికలపైనా నేతలకు క్లారిటీ ఇస్తారు. అనంతరం వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయకు వెళ్లి కీలక ప్రకటన చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. అయితే షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా లేక ఏఐసీసీ పదవి ఇచ్చి సరిపెడతారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
కాంగ్రెస్ లో చేరాక వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేంందుకు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐసీసీ, సిడబ్ల్యుసిలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరికపై కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇవాళ తెరపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications