రాహుల్ రీఎంట్రీని స్వాగతించిన వైఎస్ షర్మిల-అవిశ్వాస తీర్మానానికి మద్దతు-కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో వైఎస్సార్టీపీని స్ధాపించి హంగామా చేసిన వైఎస్ షర్మిల ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. అయితే త్వరలో కాంగ్రెస్ లో ఆమె చేరిక ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతుగా షర్మిల వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ ఆమె రాహుల్ గాంధీ రీఎంట్రీతో పాటు లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో షర్మిల వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ సభ్యునిగా తిరిగి నియమించబడ్డ రాహుల్ గాంధీ గారికి నా అభినందనలు అంటూ వైఎస్ షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయం, ధర్మం గెలిచాయనడానికి సుప్రీం కోర్టు తీర్పే ఒక ఉదాహరణ అన్నారు. మీరు తిరిగి పార్లమెంట్ కి రావడం దేశానికి ఎంతో అవసరం అన్నారు. పార్లమెంట్ వేదికగా మీ గళం వినిపిస్తారని దేశం ఎదురుచూస్తుందంటూ రాహుల్ ను ఆకాశానికెత్తేశారు. అహర్నిశలు ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాద పరిరక్షణ, దేశ భద్రత, ఉన్నతి, ఐక్యతలపై మీ పోరాట పఠిమ ఎంతో ఆదర్శం అని షర్మిల పేర్కొన్నారు.

దేశ భద్రత, ఉన్నతి, ఐక్యత వీటిపై అందరు నాయకులు కలిసి పోరాడాలంటూ వైఎస్ షర్మిల సూచించారు. అలాగే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బేషరతుగా తన నైతిక మద్దతు తెలియజేస్తున్నా అంటూ షర్మిల వెల్లడించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పకనే చెప్పేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ చర్యల్ని సమర్ధిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఆమె భవిష్యత్ అడుగులు ఎటో తేలిపోయింది.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికపై తాజాగా పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమెను ఎన్నికలకు ముందు తమ పార్టీలోకి తీసుకుంటే కేసీఆర్ ఆంధ్రా పేరుతో తమను టార్గెట్ చేయొచ్చని భయపడుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేశారు. దీంతో అధిష్టానం కూడా తెలంగాణ ఎన్నికల వరకూ ఆగి ఆ తర్వాత ఏపీలో ఆమెను రంగంలోకి దింపవచ్చని భావిస్తోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల తమ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్తున్నారు.












Click it and Unblock the Notifications