సునీత నో, కడప ఎంపీ అభ్యర్థి ఖరారు - షర్మిల, చంద్రబాబు కొత్త వ్యూహం..!!
ఏపీ ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా పొత్తులు, కొత్త ఎత్తులు సిద్దం అవుతున్నాయి. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో తమ అభ్యర్దుల ఖరారు పైన ఫోకస్ చేసాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో కడప, పులివెందులలో కాంగ్రెస్ నుంచి పోటీ..అభ్యర్దుల ఎంపిక ఆసక్తి కరంగా మారుతోంది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి.
కీలక పరిణామాలు : పీసీసీ చీఫ్ గా షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారనేది ఇప్పుడు కడపలో చర్చగా మారింది. కడప పార్లమెంట్, పులివెందుల స్థానాల వైపు షర్మిల చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్దిగా జగన్ మరోసారి పోటీ చేయటం ఖాయం. అదే విధంగా ఎంపీ అభ్యర్దిగా వైఎస్ అవినాశ్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి అభ్యర్దుల విషయంలో అధికారికంగా నిర్ణయం వెలువడిన తరువాత కాంగ్రెస్, టీడీపీ తమ అభ్యర్దులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి. కొంత కాలంగా వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం ఉంది. తాజాగా ఇడుపుల పాయలో షర్మిలతో భేటీ సమయంలో సునీత తాను పార్టీలో చేరటం లేదని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

పోటీ చేసేదెవరు : ఇటు టీడీపీ మిగిలిన ఎంపీ స్థానాలకు దాదాపు అభ్యర్దులను సిద్దం చేసింది. కడప విషయంలో మాత్రం వైసీపీ, కాంగ్రెస్ నిర్ణయం తరువాతనే తమ అభ్యర్దిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. అయితే, తాజాగా ఒక కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నిలిచేలా కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. వివేకా కుటుంబానికి మద్దతుగా నిలుస్తామనే నినాదంతో టీడీపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్దులను నిలబెట్టకుండా అక్కడ సౌభాగ్యమ్మ పోటీలో ఉంటే మద్దతు ఇచ్చేలా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాష్ ను టార్గెట్ చేయటం లక్ష్యంగా కనిపిస్తోంది.

టార్గెట్ వైసీపీ : ఇదే సమయంలో వైసీపీలోనూ కడప జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్దుల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జమ్మలమడుగు, కమలాపురం, కడప అసెంబ్లీ స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. కడప కేంద్రంగా సీఎం జగన్ ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు కాంగ్రెస్ , టీడీపీ వ్యూహ రచన చేస్తున్నాయి. దీంతో, ఎన్నికల సమయంలో కడపలో చోటు చేసుకొనే రాజకీయం పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications