అవినాష్ ఎపిసోడ్ లో సీబీఐ నెక్స్ట్ స్టెప్ - వేగంగా పరిణామాలు..!?
కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. హైకోర్టు అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నిర్ణయం ప్రకటించలేదు. జూన్ 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది. తక్షణమే అవినాష్ పిటీషన్ పైన వాదనలు వినటానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీబీఐ ఇప్పుడు ఏం చేయనుంది. అవినాష్ అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
సీబీఐ అడుగుల పై ఉత్కంఠ: వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ లక్ష్యంగా ఇప్పుడు కేసు కొనసాగుతోంది. అవినాష్ ఈ కేసులో తనకు ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. హత్య జరిగిన రోజున జరిగిన పరిణామాలను వివరించారు. వివేకా హత్య కేసు వెనుక అనేక కారణాలు ఉన్నాయని కోర్టులో వాదించారు. వివేకా రెండో భార్య, ఆస్తుల వివాదం గురించి ప్రస్తావించారు. సునీత భర్త రాజశేఖరరెడ్డిని కాపాడుకోవటం కోసం తమ పైన నిందలు మోపుతున్నారని ఆరోపించారు.

సునీత అటు కోర్టుల్లో అవినాష్ కేసుల్లో ఇంప్లీడ్ అవుతున్నారు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణల్లోనూ వాదోపవాదనలు కొనసాగాయి. నిర్ణయం మాత్రం న్యాయమూర్తి వాయిదా వేసారు.
కోర్టులో మరోసారి ప్రయత్నం: తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అవినాష్ ముందస్తు బెయిల్ వెంటనే విచారణ చేయాలని కోరుతూ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ కోర్టును ఆశ్రయించారు. ఆయన సుప్రీం సీజే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వెంటనే విచారణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో, సెలవుల్లో వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటీషన్ ను తీసుకెళ్లేందుకు అవినాష్ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.
కోర్టు నుంచి ముందస్తు బెయిల్ లేదా సీబీఐని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వకపోతే అవినాష్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోర్టు నుంచి అవినాష్ అరెస్ట్ కు సంబంధించి సీబీఐ కు ఎటువంటి ఆదేశాలు లేవు. హైకోర్టులో వాదనలు జరిగిన సమయంలోనే అవసరమైతే అవినాష్ ను అరెస్ట్ చేస్తామి సీబీఐ స్పష్టం చేసింది.
సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి: ఇప్పుడు కోర్టు నుంచి అరెస్ట్ చేయకుండా ఎటువంటి అడ్డు లేదు. సీబీఐ ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని ఆరుసార్లు విచారించింది. తండ్రి భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కలిపి విచారించింది. అవినాష్ చేసిన ఆరోపణల ఆధారంగా సునీతతో పాటుగా ఆమె భర్త రాజశేఖరరెడ్డిని సీబీఐ సుదీర్ఘంగా విచారణ చేసింది. హత్య జరిగిన రోజు లేఖ గురించి ఆరా తీసింది.
ఇప్పుడు అవినాష్ విషయంలో సీబీఐ తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. వివేకా కేసు విచారణ కాల పరిమితి సుప్రీంకోర్టు జూన్ నెలాఖరు వరకు పొడిగించారు. అవినాష్ కస్టోడియల్ విచారణకు సహకరిస్తారని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. దీంతో, ఇప్పుడు సీబీఐ మరోసారి విచారణకు అవినాష్ ను పిలుస్తుందా లేక కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తుందా అనేది ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications