వివేకా కేసులో కీలక పరిణామం-సీబీఐ కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది. ఇందులో ఒకరు అప్రూవర్ దస్తగిరికి బెయిల్ లభించింది. అలాగే ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి కూడా గతంలో డీఫాల్ట్ బెయిల్ లభించింది. కానీ సీబీఐ అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాజాగా దాన్ని రద్దు చేసింది. దీంతో ఆయన ఇవాళ సీబీఐ కోర్టులో లొంగిపోయారు.
వివేకా హత్యను దగ్గరుండి పర్యవేక్షించిన ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ ఇప్పటికే ఈ కేసులో ఏ1గా చేర్చింది. గంగిరెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు గతంలో ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. బెయిల్ రద్దు చేసింది. ఈ నెల 5వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. లొంగిపోకపోతే అరెస్టు చేసేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది.

దీంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు చేరుకున్న ఎర్ర గంగిరెడ్డి లొంగిపోయారు. ఈ మేరకు ఆయన లాయర్ ద్వారా సీబీఐ కోర్టు న్యాయమూర్తికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. ఎర్ర గంగిరెడ్డి లొంగుబాటుతో ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిని సీబీఐ జైలుకు పంపినట్లయింది. వీరు కాకుండా దస్తగిరి మాత్రమే బెయిల్ పై బయట ఉన్నారు.

మరోవైపు వివేకా కేసులో దర్యాప్తును పూర్తి చేసేందుకు తొలుత ఏప్రిల్ 30 వరకూ గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు.. అనంతరం తాజా పరిణామాల నేపథ్యంలో దాన్ని జూన్ 30 వరకూ అంటే రెండు నెలల పాటు పొడిగించింది. దీంతో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసే జూన్ 30 వరకూ ఎర్ర గంగిరెడ్డ బెయిల్ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత గంగిరెడ్డి తిరిగి బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చింది.












Click it and Unblock the Notifications