వివేకా కేసులో మళ్లీ సీబీఐ దర్యాప్తు? కోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ సీబీఐ దర్యాప్తు ఏమీ తేల్చలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసిందంటూ సీబీఐ నేరుగా సుప్రీంకోర్టులోనే చెప్పేసింది. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె వినతి మేరకు ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సునీత హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ జరిపిన దర్యాప్తు సంతృప్తి కరంగా లేదని, ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమంటూ సునీతారెడ్డి కోర్టును కోరారు. ఆమె పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సునీత తరఫున వాదనలు విన్న సీబీఐ కోర్టు.. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఈ నెల 10వ తేదీన దీనిపై తీర్పు ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పు ఉత్కంఠ రేపుతోంది.

ఇవాళ జరిగిన విచారణలో వివేకా కుమార్తె సునీత తరఫు లాయర్ వాదన వినిపించారు. ఇందులో సునీత తన తండ్రి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్ కు అదనంగా అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. అలా చేస్తేనే ఈ కేసులో ఇప్పటివరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకు వస్తాయని సునీత లాయర్ సీబీఐ కోర్టుకు తెలిపారు. దీంతో వాదనలు ముగించిన సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications