వివేకా లెటర్ ఎందుకు దాచానంటే ? సీబీఐకి వాంగ్మూలంలో అల్లుడు షాకింగ్ రీజన్...!
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ముఖ్యంగా తాజాగా సీబీఐ కోర్టుకు సీబీఐ సమర్పించిన అదనపు ఛార్జిషీట్ లో పేర్కొన్న వాంగ్మూలాలు సంచలనంగా మారుతున్నాయి. ఇదే క్రమంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కూడా బయటికి వచ్చింది. ఇందులో ఆయన వివేకా రాసిన లేఖను ఎందుకు దాచాల్సి వచ్చిందనేది వెల్లడించారు.
వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఆయన ఆర్ధిక వ్యవహారాలు చూసేవారని ఇప్పటికే సీబీఐ నిర్ధారించింది. అలాగే వివేకా హత్య తర్వాత ఆయన పీఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అప్పుడు వివేకా రాసిన లేఖ గురించి కూడా చెప్పారు. ఈ సమయంలో రాజశేఖర్ రెడ్డి తన మామగారు వివేకానందరెడ్డి రాసిన లేఖను రహస్యంగా ఉంచమని కృష్ణారెడ్డికి చెప్పారు. ఈ అంశంపై ఈ కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ లేఖను దాచమని ఎందుకు చెప్పారో సీబీఐకి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.

హత్య జరిగిన తర్వాత ఉదయం ఆరున్నర గంటలకు వివేకా పీఏ కృష్ణారెడ్డి తనకు ఫోన్ చేసి ఘటనా స్ధలిలో లేఖ దొరికిందని చెప్పారని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అప్పుడు ఈ లేఖలో ఏముందని ఆయన కృష్ణారెడ్డిని అడిగారు. దీంతో ఆయన డ్రైవర్ ప్రసాద్ తనని హత్య చేశాడని రాసినట్లు తెలిపారు. దీంతో ఆయన లేఖను రహస్యంగా ఉంచాలని సూచించారు. దీని వెనుక కారణాన్ని సీబీఐకి తెలిపారు. గతంలో వైఎస్ జగన్ తాత రాజారెడ్డి హత్య తర్వాత చోటు చేసుకున్న ఘటనల్ని, వివేకా డ్రైవర్ ప్రసాద్ కు ఉన్న ప్రాణహానిని దృష్టిలో ఉంచుకుని దాన్ని రహస్యంగా ఉంచాలని చెప్పనన్నారు.
మరోవైపు సీబీఐ అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా రాజశేఖర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇందులో వివేకా పేరుతో ఉన్న ఆస్తుల్లో తనకు కొన్ని మాత్రమే తెలుసని చెప్పారు. అలాగే హత్యకు ముందు రోజు రాత్రి ఆయన వచ్చే ఎన్నికల్లో తాను కడప ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు చెప్పారన్నారు. అటు వివేకా హంతకుల్లో ఒకరిగా భావిస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోన్ గూగుల్ టేకవుట్ లొకేషన్ ను కూడా వివేకా ఇంటిగా రాజశేఖర్ రెడ్డి గుర్తించారు.












Click it and Unblock the Notifications