17మంది హతం, బాధ ఎవరికి చెప్పాలి: జగన్, బడ్జెట్‌పై..
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ దాడులకు పాల్పడుతుంటే తమ బాధలను ఎవరితో చెప్పుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సాయంత్రం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికల సమయంలో టీడీపీ వారు అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. ఏపీలో తమ కార్యకర్తల పైన జరిగిన దాడులను, అక్రమాలను రాష్ట్రపతికి వివరించామని తెలిపారు. రాష్ట్రపతికి మూడు పేజీలు మెమోరాండం ఇచ్చినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జెడ్పీటీసీలకు స్వయంగా ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేశారని నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు. ఎన్నికలలో టీడీపీ పూర్తిగా ఏకపక్ష ధోరణితో వ్యవహరించిందన్నారు. దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు. తమ పార్టీకి చెందిన సభ్యులను కిడ్నాప్ చేశారని, బెదిరించారని, ప్రలోభ పెట్టారని ఆరోపించారు. సర్కారు ఏర్పడిన నెల రోజుల్లో తమ పార్టీకి చెందిన 17 మంది కార్యకర్తలను హతమార్చడం, 119ని గాయపర్చడం బాధాకరమన్నారు.

దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని తాము రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. మరికొద్ది సేపట్లో దేశ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించనప్పుడు ఇక ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్న దృష్యా జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు.
బడ్జెట్ పైన....
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ పైన జగన్ స్పందించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పష్టత లేదన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రిని కలుస్తామన్నారు. బడ్జెట్‌లో క్లారిటీ లేదన్నారు.












Click it and Unblock the Notifications