YCPలోకి కొత్త వారసుడొచ్చాడు.. అధిష్టానం OK?
వారసత్వ రాజకీయాలు ఈసారి ఎన్నికలకు వద్దని, అందరూ సీనియర్లే పోటీచేయాలని ముఖ్యమంత్రి జగన్ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. అయినప్పటికీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ వారసులను రంగంలోకి తీసుకొస్తున్నామని, తమకు బదులుగా వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, తమ కుమారులకు వచ్చే ఎన్నికల్లో సీట్లివ్వాలంటూ కోరారు. అయితే ముఖ్యమంత్రి జగన్ వాటిని నిర్ద్వంద్వంగా ఖండించారు.

ఈసారికి వారసత్వ రాజకీయాలు వద్దు?
వారసత్వ రాజకీయాలు ఈసారి ఎన్నికలకు వద్దని, ఏదైనా ఉంటే తర్వాత చూద్దామన్నారు. అయినప్పటికీ ఆశ చావక చాలామంది సంప్రదిస్తున్నప్పటికీ అందరికీ నిరాశే ఎదురవుతోంది. అయితే ఒకే ఒక్క వారసుడికి మాత్రం అవకాశం కనిపిస్తోంది. మంత్రి పినిపె విశ్వరూప్ చిన్న కుమారుడు శ్రీకాంత్ కి వైసీపీ అధిష్టానం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. విశ్వరూప్ నియోజకవర్గం అమలాపురంలో ఇప్పటికే శ్రీకాంత్ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

బైపాస్ సర్జరీ చేయించుకున్న విశ్వరూప్
ఇటీవలే ముంబయిలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న విశ్వరూప్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం తగ్గించారు. అమలాపురం కూడా అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు. హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారా? లేదా? అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. విశ్వరూప్ పెద్దకుమారుడు కృష్ణారెడ్డి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

కృష్ణారెడ్డికి మైనస్ గా అమలాపురం అల్లర్లు
అమలాపురం అల్లర్ల తర్వాత కృష్ణారెడ్డి వైఖరి మంత్రికి మైనస్ గా మారిందనే అభిప్రాయం నియోజకవర్గంలోనే వ్యక్తమవుతోంది. దీంతో తన చిన్న కుమారుడు శ్రీకాంత్ ను తన రాజకీయవ వారసుడిగా ముఖ్యమంత్రికి మంత్రి తెలిపారు. రానున్న ఎన్నికల్లో విశ్వరూప్ పోటీచేయకపోతే పార్టీ పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. అమలాపురం ఎంపీ అనురాధ విశ్వరూప్ చిన్న కుమారుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. అమలాపురం అసెంబ్లీ సీటు తనకివ్వాలంటూ ఎంపీ కోరుతున్నారు. ఒకవేళ ఆమె ఎమ్మెల్యేగా పోటీచేస్తే విశ్వరూప్ కుటుంబం నుంచి ఒకరు ఎంపీగా పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications