వైఎస్ ఫోటో తొలగింపు, టెన్షన్, నాని పార్కింగ్ రగడ
విజయవాడ/తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటోను తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఫోటో తొలగింపు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పార్టీ ఎంపీ వరప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామిలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తుడా కార్యాలయం ఎదుట బైఠాయించారు.
వైయస్ ఫోటోను తొలగించడం సరికాదన్నారు. మరోవైపు, గత ముఖ్యమంత్రుల ఫొటోలను తొలగించి, ప్రస్తుత సీఎంల ఫొటోలను కార్యాలయాల్లో ఉంచడం ఆనవాయతీ అన్న సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

కారు రేసింగ్‌లో ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు!
విజయవాడలో ఆదివారం చోటుచేసుకున్న కారు ప్రమాదంలో నగరానికి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు తనయుడు పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సిద్ధూతో పాటు శ్రీరాములు అనే విద్యార్థిపైనా కేసు నమోదు చేసినట్లు విజయవాడ పోలీసులు తెలిపారు.
కారు రేసింగ్‌లో భాగంగా సిద్ధూ మితిమీరిన వేగంతో కారును నడిపిన కారణంగానే ప్రమాదం సంభవించిందని, ఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధూతో పాటు శ్రీరాములుపై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.
మళ్లీ కేశినేని పార్కింగ్ వివాదం
విజయవాడ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానికి పార్కింగ్ స్థలం వివాదం సోమవారం మరోసారి రాజుకుంది. ఈ విషయమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఉదయం వాగ్వాదం జరిగింది. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. బెజవాడ పాతబస్టాండు సెంటర్లోని స్థలం పైన వివాదం కొనసాగుతోంది. దీని పైన వెంకట సుబ్బారావు స్పందించారు. సాయంత్రంలోగా నాని స్థలాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు తాను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications