వైసీపీ 11వ జాబితా విడుదల: రాపాకతోపాటు వీరికి చోటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, శుక్రవారం రాత్రి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 11వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు సమన్వయకర్తలను వైసీపీ ప్రకటించింది.
కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జీగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ సమన్వయ కర్తగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీగా గొల్లపల్లి సూర్యారావును నియమించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా, ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జీలను నియమించింది వైసీపీ. మొత్తం 175 సీట్లకు 175 సీట్లు మనమే గెలవాలని.. ఆ ప్రయత్నం చేద్దామని ఇప్పటికే వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే.. పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని నేతలకు జగన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాలని శ్రేణులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించారు. వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications