AP Election: ఏపీలో 80 శాతంపైగా ఓటింగ్ ? వైసీపీ, కూటమి ధీమా వెనుక లెక్కలివే..!
ఏపీలో నిన్న జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన ఓటర్లు ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే క్యూల్లో నిలబడ్డారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ కూడా చాలా చోట్ల పోలింగ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల వరకే 78 శాతం పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో తుది పోలింగ్ లెక్కల్లో ఇది 80 శాతం దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ, కూటమిలో ధీమా పెంచుతోంది.
రాష్ట్రంలో నిన్న జరిగిన పోలింగ్ లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున అంటే లక్షల సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు తరలివచ్చి ఓట్లు వేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలు, వృద్ధులు, యువత భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలు చోట్ల నాలుగైదు గంటల సేపు క్యూలలో నిలబడాల్సి వచ్చినా అలాగే ఓపిగ్గా ఉండి ఓటు వేసి వెళ్లారు. దీంతో వీరి ప్రభావం పోలింగ్ శాతాల్లో కనిపిస్తోంది.

రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ 78 శాతం పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ ఓటర్ టర్నవుట్ యాప్ లెక్కలు చెప్తున్నాయి. అంటే ఆ తర్వాత జరిగిన పోలింగ్ కలుపుకున్నా ఇది 80 శాతం దాటిపోవడం ఖాయంగా ఉంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతే కారణమన్న ఓ లెక్క ఉంది. అయితే ఈసారి ఈ పెరిగిన పోలింగ్ తమ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన భారీ మద్దతుగా వైసీపీ చెబుతోంది.
ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు సాలిడ్ గా టీడీపీ కూటమికి ఓటేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది. అయితే ఐదేళ్లుగా కులాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా తాము అందరికీ సంక్షేమం అందించామని వైసీపీ చెబుతున్న లెక్కలు నిజమైతే ఆయాఓటర్ల మద్దతు లభిస్తే వైసీపీ గట్టెక్కినట్లే. అలా కాదని తిరిగి వారంతా పార్టీల వారీగా చీలిపోతే మాత్రం కూటమి విజయం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications