మోడీకి తొలిసారి షాకిచ్చిన వైసీపీ ..! బుక్కయిన టీడీపీ ! పార్లమెంట్ వేదికగా..
ఏపీలో గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు ప్రతీ విషయంలో పరోక్షంగా మద్దతిచ్చిన వైసీపీకి ఎన్నికలకు ముందు మాత్రం మోడీ షాకిచ్చారు. తమకు అండగా నిలిచిన వైసీపీని కాదని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కూటమితో జత కట్టారు. ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి వైసీపీ కేంద్రంలో ఎన్డీయే కూటమికి షాకిచ్చింది. కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించింది.
2013 నాటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం ఇవాళ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై లోక్ సభలో అధికార, విపక్ష సభ్యులు మాట్లాడారు. ఈ బిల్లును విపక్ష ఇండియా కూటమిలో పార్టీలన్నీ వ్యతిరేకించాయి.అలాగే ఎన్డీయే పక్షాలు సమర్ధించాయి. అలాగే ఏపీకి చెందిన రాజకీయపక్షాలు టీడీపీ, వైసీపీ కూడా ఈ బిల్లుపై లోక్ సభలో స్పందించాయి. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించగా.. కేంద్రంలో భాగస్వామి అయిన టీడీపీ మాత్రం సమర్ధించింది.

టీడీపీ ఎంపీ హరీష్ మాథుర్ వక్ఫ్ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో మాట్లాడారు. మతపరమైన అవసరాల కోసం భూములివ్వడం అనేది అన్ని మతాల్లోనూ ఉందని, అయితే ఇలా దానమిచ్చిన దాతల ఉద్దేశం నెరవేరడం లేదని, ఇందులో పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ బిల్లు తెస్తుందన్నారు. ఈ బిల్లు వల్ల మహిళల ప్రయోజనాలు కూడా నెరవేరతాయన్నారు. అయితే అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు.

అనంతరం మాట్లాడిన వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మాత్రం వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ముస్లింల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ మేరకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అభ్యంతరాలతో తాము ఏకీభవిస్తున్నట్లు మిథున్ రెడ్డి వెల్లడించారు. కాబట్టి ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications