బర్త్ డే కోసమే అసెంబ్లీ నుంచి జగన్ వాకౌట్, రోజా సంతోషం: కాల్వ, ఇదీ ప్రవర్తన: బాబు
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు రేపు (మంగళవారం) శాసన సభకు హాజరు కావాలని చీప్ విఫ్ కాల్వ శ్రీనివాసులు సోమవారం అన్నారు. రేపు బాక్సైట్ తవ్వకాలు, తదితర అంశాల పైన చర్చిద్దామన్నారు.
విపక్షం ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలని హితవు పలికారు. విపక్షం నాలుగు రోజుల విలువైన సమయాన్ని వృథా చేసిందని కాల్వ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకోడానికే అసెంబ్లీ నుంచి జగన్ వాకౌట్ చేశారని కాల్వ ఆరోపించారు. సస్పెండ్ చేసినప్పుడు రోజా సంతోషంగానే వెళ్లిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అసలు బాక్సైట్ పైన చర్చ జరగడం ప్రతిపక్ష నేతకు ఇష్టం లేదని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకే ఆయన ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎంపీ జెసి దివాకర్ రెడ్డి కూడా సభలో జగన్ తీరును తప్పుబట్టిన విషయం తెలిసిందే. కాల్ మనీ వ్యాపారం తాను పుట్టకముందు నుంచే ఉందన్నారు. తమతో ఎవరెవరో వచ్చి ఫోటోలు దిగుతారని అలాంటివారందరితోనూ మాకు సంబంధాలుంటాయా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికైనా డబ్బులిచ్చి వడ్డీ వ్యాపారం చేయమన్నట్లు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. పులివెందులో జరిగే కాల్ మనీతో సంబంధం ఉందని జగన్ ఒప్పుకుంటారా? అని నిలదీశారు.

సీమకు నీరిస్తాం, ఉభయ గోదావరి జిల్లాలకు నష్టం జరగదు: బాబు
ఎట్టి పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు నష్టం రానివ్వమని చెప్పారు. హంద్రీనీవా, గాలేరు - నగరి ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీరు అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వాతావరణ సమతుల్యానికి నీరు చాలా ముఖ్యమన్నారు. వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
ఆయన శాసన సభలో మాట్లాడారు. వర్షపాతాల్లో హెచ్చు తగ్గుల వల్ల కొంత ఇబ్బంది పడుతున్నామన్నారు. కొత్త ప్రాజెక్టుల వల్ల 36 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. గత పదేళ్ల కాలంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.
గత పదేళ్లలో డబ్బులు ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. చరిత్రలో మొదటిసారి రెండు నదుల అనుసంధానం జరిగిందన్నారు. ఒక్క ఎకరా ఎండిపోకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కృష్ణా నది పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కరువును శాశ్వతంగా పారదోలేందుకు శాశ్వత పరిష్కారం కనుగోవాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. భూగర్భ జలాలను పెంచితే నీటి సమస్య ఉండదని చెప్పారు.
మండలిలో మిథున్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించిన బాబు
శాసన మండలిలో కాల్ మనీ అంశంపై చర్చ సందర్భంగా రాజంపేట వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ పైన మిథున్ రెడ్డి దాడి చేశారని, దానిపై కేసు పెడితే అనవసర రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.
రాజీనామా చేస్తానని కూడా అన్నారని, ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చిందని, దాని తర్వాత మిథున్ రెడ్డి ఇంత వరకు మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. వైసిపి నేతలు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నారు. కాల్ మనీ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు.












Click it and Unblock the Notifications