కౌంటింగ్ వేళ సుప్రీంను ఆశ్రయించిన వైసీపీ-అత్యవసర విచారణ ..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతన్నాయి. మరో 24 గంటల్లో కౌంటింగ్ ప్రారంభమై ఫలితాల సరళి కూడా వెలువడనుంది. ఈ తరుణంలో అధికార వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓ కీలక అంశంపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విచారణలో నిర్ణయం తమకు అనుకూలంగా వస్తే రేపటి కౌంటింగ్ లో లాభం ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల నమోదుకు ఉద్యోగులు ఇచ్చే డిక్లరేషన్ పై రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వంటి వివరాలు పేర్కొనాల్సిన అవసరం లేదంటూ ఈసీ ఏపీలో వెసులుబాటు ఇచ్చింది. భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైన నేపథ్యంలో ఈ వివరాలన్నీ ఉండాలంటే ఎక్కువ సమయం పడుతుందని భావించిన ఈసీ.. ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని తెలిపింది. దీన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది.
ఇదే అభ్యంతరంతో ఈసీని, హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు కౌంటింగ్ చేపట్టనున్న నేపథ్యంలో ఇవాళ తమ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఇచ్చే తీర్పు రేపటి కౌంటింగ్ లో కీలకంగా మారడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే వైసీపీకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు.












Click it and Unblock the Notifications