సాయిరెడ్డికి జగన్ షాక్ -బాధ్యతల నుంచి ఔట్.!
ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తున్నారు. వరుస సమావేశాలతో భవిష్యత్ పై భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలు..ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ ఈ రోజు పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో ఏ విధంగా వ్యవహరించాలో సూచించారు. అదే సమయంలో పార్టీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి విషయంలో కీలక మార్పు చేసారు.
జగన్ దిశానిర్దేశం
జగన్ పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ లోక్ సభ పక్ష నేతగా ఇప్పటి వరకు కొనసాగిన మిథున్ రెడ్డినే కొనసాగించాలని నిర్ణయించారు. రాజ్యసభ పక్షనేతగా విజయ సాయిరెడ్డిని కంటిన్యూ చేసారు. అదే సమయంలో సీనియర్ నేతగా పార్లమెంటరీ పార్టీ నేతగా ఇప్పటి వరకు వ్యవహరిస్తూ వచ్చిన సాయిరెడ్డిని పార్టీ అధినేత జగన్ ఆ బాధ్యతల నుంచి తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా జగన్ ప్రకటించారు. అందరికీ తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలని సూచించారు.

సుబ్బారెడ్డికి బాధ్యతలు
పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు. ఎంపీలు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికిందని జగన్ గుర్తు చేసారు. కాని, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి... టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయని జగన్ వివరించారు. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నారు.
అధికారంలోకి వస్తాం
టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. వైయస్సార్సీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయన్నారు. కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారని చెప్పుకొచ్చారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయని చెప్పిన జగన్..గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయన్నారు. ప్రజలు మళ్లీ తమను అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications