బాబుకు షాక్: 'వాటా తేలకే సీఎం రమేష్ అవినీతి లేఖ, దేవినేనిని తొలగించాలి'
విజయవాడ: అవినీతి పైన తెలుగుదేశం పార్టీకే చెందిన ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాశారని, ప్రభుత్వ అవినీతిని సొంత పార్టీ ఎంపీయే ప్రశ్నించారని, దీని పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆదివారం నిలదీశారు.
అంతులేని అవినీతికి పాల్పడుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును వెంటనే బర్తరఫ్ చేయాలని తమ్మినేని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జలవనరుల శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా టీడీపీ నేతల తీరు ఉందన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన టిడిపి ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. ప్రభుత్వ అవినీతికి ఈ లేఖనే నిదర్శనమని చెప్పారు. వాటాల్లో లెక్కలు తేలక టీడీపీ నేతలు ఒకరి దోపిడీని మరొకరు బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అవినీతిపై విచారణ జరిపించే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని తమ్మినేని సవాల్ చేశారు. సొంత పార్టీ ఎంపీ అవినీతి ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారన్నారు. కాంట్రాక్టు కంపెనీలను తక్షణమే బ్లాక్ లిస్టులో చేర్చాలన్నారు. నిజాయితగా పని చేసే ఐఏఎస్ అధికారులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications