gangadhara nellore Assembly constituency: కంచుకోటలో వైసీపీ హ్యాట్రిక్ కి టీడీపీ బ్రేక్ వేస్తుందా?
చిత్తూరు లోక్ సభ స్ధానం పరిధిలోకి వచ్చే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ కంచుకోటగా పేరు తెచ్చుకుంది. దాదాపు 2 లక్షల మంది ఓటర్లున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎస్సీ మాల జనాభా ఎక్కువ. ఆ తర్వాత రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరి తర్వాత స్ధానాల్లో కమ్మ, బలిజ ఓటర్లు ఉంటారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న జిల్లా కావడంతో ఆ ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువే.
గతంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటివరకూ వేపంజేరి నియోజకవర్గంగా ఉండేది. ఆ తర్వాత వెదురుకుప్పం, కార్వేటి నగరం, పెనుమూరు, ఎస్ఆర్ పురం, జీడీ నెల్లూరు, పాల సముద్రం మండలాలతో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో నియోజకవర్గం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. ఆ తర్వాత వైసీపీ వరుసగా రెండుసార్లు ( 2014, 2019)లో గెలిచింది.

2009లో గంగాధర నెల్లూరు నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత కుతూహలమ్మ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత నారాయణస్వామి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. జగన్ రెండు కేబినెట్లలోనూ నారాయణ స్వామి డిప్యూటీ సీఎంగానే ఉన్నారు. దీన్ని బట్టి వైసీపీ ఇక్కడి ఓటర్లకు, ప్రజాప్రతినిధికి ఇస్తున్న ప్రాధాన్యం అర్ధం చేసుకోవచ్చు.
2014లో 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నారాయణస్వామి, 2019కి వచ్చేసరికి ఏకంగా 45 వేల ఓట్లకు పైగా దాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు మూడోసారి గెలుపు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి ఉన్న బలమైన ఎస్సీ, మైనార్టీ, రెడ్డి ఓటు బ్యాంకులు ఆయనకు కలిసి వస్తున్నాయి. వైసీపీ సర్కార్ సంక్షేమాన్ని నమ్ముకుని ఆయన హ్యాట్రిక్ పై గురిపెట్టారు. మరోవైపు టీడీపీ కూడా ఈసారి ఎలాగైనా నారాయణస్వామికి చెక్ పెట్టేందుకు కమ్మ, బలిజ ఓటర్ల సాయంతో రాజకీయం చేస్తోంది. అయినా స్ధానిక సమీకరణాల దృష్ట్యా టీడీపీ గెలవడం అంత సులభం కాదని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications