Bheemili assembly Constituency: జగన్ హవాలో వైసీపీ బోణీ-ఈసారి గురుశిష్యుల పోటీలో..?
ఏపీలో విశాఖపట్నం జిల్లాలోని జనరల్ అసెంబ్లీ సీటు భీమిలి. విశాఖ లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే భీమిలి అసెంబ్లీ సీటు పరిధిలోకి భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్ మండలాలు వస్తాయి. ఇక్కడ ఏకంగా 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఆర్ధికంగా కీలకమైన ఈ నియోజకవర్గంపై ఆన్ని పార్టీల కన్నూ ఉంటుంది. టూరిజం , రియల్ ఎస్టేట్ , ఉన్నత విద్యాసంస్థలు , సాఫ్ట్ వేర్ కంపెనీల వల్ల ఈ ప్రాముఖ్యత వచ్చింది.
భీమిలి అసెంబ్లీ సీటు పరిధిలో జనాభా పరంగా చూస్తే కాపులు , యాదవులు, మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. క్షత్రియులు కూడా రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా విశాఖ నగరం భీమిలి వైపు విస్తరిస్తూ ఉండటంతో అన్ని కులాల వారి ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావానికి ముందు ఇక్కడ ఓ ఉపఎన్నికతో పాటు ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఐదుసార్లు (1960, 1962, 1967, 1972, 1978) గెలిచింది. ఇందులో మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగా పూసపాటి విజయరామ గజపతిరాజు విజయం సాధించారు. 1952లో ఓసారి ఇండిపెండెంట్, 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్దీ గెలిచారు.

టీడీపీ ఆవిర్భావం తర్వాత భీమిలి సీటులో జరిగిన 9 ఎన్నికల్లో ఆరుసార్లు (1983, 1985, 1989, 1994, 1999, 2014)టీడీపీ గెలిచింది. దీన్ని బట్టి ఇక్కడ టీడీపీ ప్రభావం అర్ధం చేసుకోవచ్చు. అయితే 2009లో పీఆర్బీ, 2019లో వైసీపీ కూడా గెలిచాయి.2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా గెలిచిన అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస్) తిరిగి 2019 లో వైసీపీ అభ్యర్ధిగా గెలిచి మంత్రిగా పనిచేశారు. మధ్యలో 2014లో టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాస్ గెలిచి మంత్రిగా పనిచేశారు.
గత ఎన్నికల్లో జనసేన కారణంగా టీడీపీ ఓడిపోయిన సీట్లలో భీమిలి కూడా ఒకటి. జనసేన అభ్యర్ధి సాధించిన 25 వేల ఓట్లు టీడీపీని 9 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించాయి. ఈసారి టీడీపీ,జనసేన పొత్తు ఉండటంతో ఇక్కడ వైసీపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కు పోటీగా ఆయన రాజకీయ గురువుగా చెప్పుకునే గంటా శ్రీనివాస్ టీడీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశముంది. అప్పుడు అవంతి చెమటోడ్చక తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications