బంతి చివరకు స్పీకర్ కోర్టుకు రావాల్సిందే?: సుప్రీంలో వైసీపీ పిటిషన్‌పై టీడీపీ
అమరావతి: ఏపీలో అధికారిక పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై శుక్రవారం ఆ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అంతేకాదు రాజ్యసభ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చేయాలని అందులో కోరింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 16 మంది ఎమ్మెల్యేలను ఆ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించడం లేదని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవాలని కోరింది. స్పీకర్ చర్యలు తీసుకోనందునే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.

అయితే ఈ పిటిషన్ వల్ల వైసీపీకి ఒరిగేదేమీ లేదంటున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన ఏ నిర్ణయమైనా శాసనసభ స్పీకర్ వద్ద జరగాల్సిందేనని, ఎవరు ఎక్కడ పిటిషన్ వేసినా బంతి చివరకు స్పీకర్ కోర్టుకు రావల్సిందేనని అంటున్నారు.
శుక్రవారం వైసీపీ వేసిన పిటిషన్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆ పార్టీ నేతల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. 'పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఫిర్యాదు స్పీకర్ పరిశీలనలో ఉంది. ఆయన నిర్ణయం తీసుకోకముందే ఆ పార్టీ మరో వేదికను ఆశ్రయించే వీలు లేదు. సుప్రీం కోర్టు కూడా స్పీకర్ వద్దకు వెళ్లాలని చెప్పే అవకాశం ఉంది' అని సీనియర్ నేత ఒకరు చెప్పారు.
అయితే ఇటీవల ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకోనున్న పరిణామాలపై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణపై తమను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా కోర్టును కోరాలని వైసీపీ యోచిస్తోంది. 'ఒక పార్టీ నేరుగా సుప్రీంలో జరుగుతున్న విచారణలో భాగస్వామ్యం తీసుకునే వీలులేదు. ముందుగా పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేయాలి. ఆ తర్వాత మాత్రమే సుప్రీంకు వెళ్లాలి.' అని చెప్పారు.
అంతేకాదు ఈ విషయం వైసీపీ నేతలకు తెలిసే ఉంటుందని, కాకపోతే ఏదో ఒక సంచలనం కలిగించడానికే తాజాగా ఈ నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications