బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే - పురందేశ్వరి హామీ..!!
ఏపీలో ఎన్నికల వేళ నేతల పార్టీ మార్పులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే వైసీపీ నుంచి కొందరు ముఖ్య నేతలు టీడీపీ, జనసేన లోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే వర ప్రసాద్ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో సమావేశమయ్యారు. గూడూరు నుంచి ఈ సారి ఎమ్మెల్సీ మేరిగ మురళీధరరావుకు జగన్ ఇంఛార్జ్ బాధ్యతలు కేటాయించారు. దీంతో, తాజాగా పురందేశ్వరిని కలిసిన వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో సీటు పైన చర్చించినట్లు తెలుస్తోంది.
పురందేశ్వరితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ
వైసీపీలో సీట్లు దక్కని నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు చూస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తో సమావేశమయ్యారు. వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ సమయంలోనే మెగా కుటుంబంతో సంబంధాలు ఏర్పడ్డాయి. తరువాత వైసీపీలో చేరిన వరప్రసాద్ 2014లో తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో వరప్రసాద్ కు సీఎం జగన్ సీటు నిరాకరించారు. అక్కడినుంచి పలువురు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పరిస్థితుల్లో వైసీపీ ఇన్‌చార్జిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధరరావు పేరును పార్టీ ఖరారు చేసింది.

సీట్ల పైన కసరత్తు
దీంతో, పురందేశ్వరిని కలిసిన వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేనతో పొత్తు ఉండటంతో సీటు పైన హామీ ఇవ్వలేమని పురందేశ్వరి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలోపని చేయాలని..భవిష్యత్ లో సముచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తిరుపతికి ప్రస్తుతం వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి సీట్ల కసరత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వరప్రసాద్ కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ ను కలిసారు. పవన్ నుంచి సీటు పైన హామ లేకపోవటంతో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు పార్టీల చర్చలు
పవన్ ను కలిసిన సమయంలో వరప్రసాద్ తాను గతంలో తిరుపతి నుంచి గెలిచి ఉండటంతో, తనకు తిరుపతి సీటు కేటాయించాలని కోరారు. కానీ, పొత్తులో భాగంగా తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని పవన్ తేల్చి చెప్పారు. ఇక..ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు..అభ్యర్దుల పైన మూడు పార్టీల ముఖ్య నేతలు చర్చలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు పూర్తయిన తరువాత అభ్యర్దులను ప్రకటించనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశం లోగానే అభ్యర్దుల ప్రకటన పూర్తి చేయాలని చంద్రబాబ, పవన్ భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఏ పార్టీకి ఏ సీటు దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications