జగన్ మరో ఆస్త్రం: ఆ ఎనిమిది మంది ఇరకాటంలో పడతారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలని ఉద్దేశంతో వైసీపీ అధినేత వైయస్ జగన్ మరో ఎత్తు వేశారు. ఇందులో భాగంగా మంగళవారం తన పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ విప్ జారీ చేసింది.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని విప్ జారీ చేశారు. పార్టీ విప్, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ రెడ్డి ఈ విప్ జారీ చేశారు. అసెంబ్లీకి హాజరు కావడంతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా విప్ అందజేయాలని వైసీపీ నిర్ణయించింది. ఒకవేళ విప్ తీసుకోకుండా ఆ ఎమ్మెల్యేలు తప్పించుకోవాలని చూస్తే వారి క్వార్టర్స్‌కు వెళ్లి మరీ విప్ అందజేయాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఫిరాయింపులకు పాల్పడిన ఆ ఎనిమిది మందికి విప్ అందజేసినట్టు చూపేందుకు సాక్ష్యాలు కూడా ఉండేలా పకడ్బందీ ప్రణాళికలను వైసీపీ రచిస్తోంది. వాస్తవానికి విప్ జారీ చేసిన తర్వాత ఆయా పార్టీలకు చెందిన సభ్యులు తప్పనిసరిగా సభకు రావాల్సి ఉంటుంది. పార్టీ ఆదేశం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది.

ఒకవేళ అలా కాకుండా సభకు రాకపోయినా, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయకపోయినా సభ్యులపై అనర్హత వేటు పడుతుంది. టీడీపీలో చేరిన ఆ ఎనిమిది మందిపై అనర్హత పడేందుకు రెండుసార్లు ప్రయత్నించినా అధికారపక్షం సాయంతో వేటు నుంచి తప్పించుకున్నారు.
ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే వైసీపీకి విప్ జారీ చేసేటంత సమయం ఇవ్వకుండా అవిశ్వాసంపై హఠాత్తుగా చర్చకు నిర్ణయం తీసుకుని ప్రభుత్వం తీర్మానం నుంచి గట్టెక్కింది.
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పుడు కూడా ఇదే విధంగా అధికార పార్టీ జాగ్రత్త పడి తెలివిగా ఆ సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లో ఉండేలా అధికార పార్టీ జాగ్రత్త తీసుకుంది.
దీంతో వైసీపీ విప్ జారీ చేసినా, దానిని అందుకుని సభకు వచ్చేంత సమయం తమకు లేకుండాపోయిందని ఎనిమిది సభ్యులు వాదించుకునేందుకు అస్కారం కల్పించారు. ఇలా రెండుసార్లు తప్పించుకున్న ఆ ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పుడు ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్ సమయంలో అనర్హత వేటు వేయించాలని పార్టీ తాజాగా విప్ జారీ చేసింది.
అయితే ఈ సారి ఆ ఎనిమిది పార్టీ సభ్యులను కాపాడేందుకు అధికార పక్షం ఏ ఎత్తు వేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications