చంద్రబాబును కలుస్తా, అన్ని విషయాలు వివరిస్తా- వల్లభనేని వంశీ..!!
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. వైసీపీ లక్ష్యంగా కూటమి కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ పోరుబాట తీవ్రత పెంచుతోంది. ఇదే సమయంలో వైసీపీ నేత వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ మధ్య లేఖల ద్వారా కీలక అంశాలను చంద్రబాబు కు వంశీ వివరిస్తున్నారు. ఇప్పుడు నేరుగా కలిసి అన్ని విషయాలు వివరిస్తానని వెల్లడించారు.
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా రైతుల సమస్యల పైన వంశీ నేరుగా చంద్రబాబుకు లేఖ రాసారు. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలోని తెంపల్లి గ్రామంలో ఉన్న పోలవరం కాలువ ప్రాంతాన్ని సందర్శించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తక్షణమే అధికారులు స్పందించి కాలువలకు నీటిని విడుదల చేయాలని కోరారు. రైతుల సాగునీటి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అపాయింట్‌మెంట్ తీసుకుని నేరుగా కలవడానికి సిద్ధంగా ఉన్నానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

వంశీ వరుస లేఖలతో
ఇప్పటికే పది రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గ రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రికి వివరాలతో కూడిన లేఖ కూడా రాసినట్లు ఆయన గుర్తుచేశారు. కాగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తనతో కలిసి రావడం లేదా తాను సీఎంను కలవడం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే.. రైతులైనా స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పుకుంటారని వంశీ వ్యాఖ్యానించారు. రాజకీయం పక్కనపెట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలువలకు సాగునీరు విడుదల చేసి గన్నవరం రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. నీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని వంశీ స్పష్టం చేసారు. దీంతో, వంశీ అభ్యర్ధన పైన సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు... అప్పాయింట్ మెంట్ ఇస్తారా లేదా.. ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications