గెలుస్తామనే నమ్మకం ఉంటే మహిళా ఓటర్లపై టీడీపీ ఎందుకు దౌర్జన్యానికి పాల్పడింది?
Perni Nani: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

పోలింగ్ రోజు, ఆ తరువాతా అల్లర్లతో కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పల్నాడు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లా చంద్రగిరిల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నాయకులు దాడులు- ప్రతిదాడులకు దిగారు.
దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మాచర్లలో దాడులు జరిగిన తరువాత కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పల్నాడు జిల్లాలో ఎవరిని నియమించాలని కోరితే వారినే అపాయింట్ చేశారని ధ్వజమెత్తారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని విమర్శించారు.
మే 15వ తేదీన పాల్వాయి గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోలింగ్ బూత్‌ను పగులగొట్టాడని, దీనిపై ఇప్పటివరకు పోలీసులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు పేర్ని నాని. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి వంటి చోట్ల పోలింగ్ రోజు, ఆ తరువాతా ఘర్షణలు ఎందుకు చోటు చేసుకున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.
పోలీసులు ఏకపక్షంగా తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఒక కంటికి కాటుక పెట్టుకున్నట్లు, మరొక కంట్లో కారం కొట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడినా వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు.
పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతుందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుగానే సమాచారం ఇచ్చినా వాళ్లు పట్టించుకోలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రానివ్వకుండా అడ్డుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. హింస జరుగుతుందని ముందుగా తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లు వదిలేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications