ఏపీ ఎన్నికల ఫలితాల పై తాజా అంచనాలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ తీసే ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అటు సీమలో బస్సు యాత్ర పూర్తి చేసిన జగన్ నెల్లూరులో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గోదావరి జిల్లాల పైన ఫోకస్ చేసారు. పవన్ రేపటి నుంచి ప్రచారం కొనసాగించనున్నారు. ఈ సమయం లోనే వైసీపీ ముఖ్య నేత సజ్జల ఎన్నికల ఫలితాల పై తన అంచనాలను వెల్లడించారు.
వైసీపీదే విజయం
కూటమి సీట్లు..అభ్యర్దుల అంశం పైన సజ్జల స్పందించారు. చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని అన్నారు. చంద్రబాబు తీరు పరకాష్ఠకు చేరిందని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు ఎవరు అనుకుంటే కూటమి పార్టీ అభ్యర్థులు డిసైడ్ అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉనికి లేకుండా పోయిందన్నారు. బీజేపీలో కూడా బాబు అనుకున్నట్టే సీట్లు ఖరారు అయ్యాయని చెప్పారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ ఓటమి చూడబోతుందని సజ్జల జోస్యం చెప్పారు.

కనుమరుగు అవుతుంది
అధికారంలో 2019 లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్ర బాబు తీరు ఎలా ఉందో అందరికి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ఏ రోజు కూడా వ్యవస్థల మీద మాట్లాడలేదని, సీఎంగా అయినా , విపక్ష నేతగా అయినా వ్యవస్థల మీద చంద్ర బాబు దాడి చేయడం పరిపాటి అని సజ్జల వ్యాఖ్యానించారు. పెన్షన్ లకు డబ్బులు లేవని చంద్ర బాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇవాళ 94 శాతం పెన్షన్ ల పంపిణీ పూర్తి అయ్యింది..మరి డబ్బులు ఉంటేనే కదా పంపిణీ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారులు స్వతంత్రంగా పని చేస్తున్నారన్నారు. ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని చెప్పుకొచ్చారు.
షర్మిల సంజాయిషీ ఇవ్వాలి
చంద్రబాబు అండ్ కో కక్షతో వలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేసిందని మండి పడ్డారు. ఇప్పుడు ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసిందన్నారు. తన ఏజెంట్ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా కుట్ర చేస్తోందన్నారు. షర్మిల ఇవ్వాల్సిన సంజాయిషీలు చాలా ఉన్నాయన్నారు. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయం అయ్యారని నిలదీసారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని ఆమె.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇదంతా.. మరో నెలలో ప్రజా కోర్టులో అది తేలుతుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications