మళ్లీ ఏ మొహం పెట్టుకుని ముగ్గురూ స్టేజెక్కారు ? సజ్జల ఫైర్...! జనం అలర్ట్ కావాలంటూ..
నిన్న పల్నాడు జిల్లాలో విపక్ష కూటమి నిర్వహించిన బహిరంగసభపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాగళం పేరుతో ముగ్గురు నేతలు రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం చంద్రబాబు,మోడీ,పవన్ లు కలిశారని, రాష్ట్ర విభజన సమయంలో తిరుపతి సభలో కలిశారని గుర్తుచేశారు. పదేళ్ల తర్వాత కూడా అదే నాటకాలు ఆడారన్నారు. నిన్నటి సభలో గతంలో ఉన్న ఉత్సాహం కనపడలేదన్నారు.
చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని, 2014 లో అందరూ కలిసినా ఒక శాతం ఓట్ల తేడాతో మాత్రమే అధికారంలోకి వచ్చారని సజ్జల గుర్తుచేశారు. 2014 లో ప్రత్యేక హోదా తో సహా ఇచ్చిన హామీలన్నీ తర్వాత ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎంతవరకూ అమలుచేశారని అడిగారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత విడాకులు ఎందుకు తీసుకున్నారనీ అడిగారు. విడిపోయిన తర్వాత బండ బూతులు తిట్టుకున్నారని గుర్తుచేశారు.

చంద్రబాబు గతంలో మోదీపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని సజ్జల ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లు అంటూ కామెంట్ చేశారని గుర్తుచేశారు. 2014లో ఎందుకు కలిశారు, హామీలు ఏమయ్యాయి అనేదానిపై నిన్న సంజాయిషీ ఇస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు సంతకంతో మేనిఫెస్టో పేపర్ ను ఇంటింటికీ పంచారన్నారు. అబద్ధాలు,మోసపూరిత హామీలతో 2014 లో అధికారంలోకి వచ్చారని తెలిపారు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ముగ్గురూ ఒకే స్టేజి పైకి వచ్చారని ప్రశ్నించారు.
అబద్ధాలు,వంచన,బాధ్యతారాహిత్యం,ప్రజలను మోసం చేయడం సులభం అనే లెక్కలేని తనం కనపడుతుందని విపక్ష కూటమిపై సజ్జల ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారని అనుకున్నారా? అని ప్రశ్నించారు. జగన్ పై దుమ్మెత్తి పోయడం,నోటికొచ్చినట్లు తిట్టడం ఒకటే పని అన్నారు. ఎన్నికలకు ముందు ఏం చేస్తారో చెప్పాలి గానీ అది చేయలేదన్నారు. నిన్నటి సభ ప్రహసనంలా సాగిందన్నారు.
మైక్ సెట్ ఫెయిల్ అయితే పోలీసులు ఏం చేస్తారని సజ్జల ప్రశ్నించారు. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళ చేతకానితనాన్ని పోలీసుల మీద చూపిస్తున్నారని విమర్శింంచారు. వైసీపీ,కాంగ్రెస్ ఒకటే అని ప్రధాని చెప్తే ప్రజలకు ఆలోచన ఉండదా? అని అడిగారు. నిన్నటి సభలో ఫెయిల్యూర్ కనపడిందన్నారు. ప్రత్యేక హోదా పై కనీసం ప్రస్తావన కూడా లేదన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేదన్నారు. చంద్రబాబు మరోసారి చేసే మోసాన్ని తిప్పి కొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి రావాలనే మోడీ అవినీతి ఆరోపణలు చేశారన్నారు.












Click it and Unblock the Notifications